బయోపిక్‌ల హవా మొదటి నుంచి బాలీవుడ్‌లో ఉన్నదే. తాజాగా బాల్‌ఠాక్రే, ఝాన్సీ లక్ష్మీభాయ్‌ల బయోపిక్స్ విడుదల అయ్యాయి. ఇక టాలీవుడ్‌లో ఇది ‘మహానటి’తో బాగా ఊపందుకుంది. ఆ వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు’ విడుదలై డిజాస్టర్ అయింది. ఇక ప్రస్తుతం తెలుగు సినీ అభిమానుల చూపంతా వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలను ఆధారంగా తీసుకుని తీస్తున్న ‘యాత్ర’, రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ఎన్టీఆర్ బాలయాస్ ‘మహానాయకుడు’లపై ఉన్నాయి. మరోవైపు కత్తికాంతారావు, ఘంటసాలలపై కూడా బయోపిక్స్ రూపొందుతున్నాయి.
ఇక ‘యాత్ర’ విషయానికి వస్తే చిత్రం ప్రారంభిస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు దర్శకుడు పెద్దగా పేరులేని మహి.వి.రాఘవ కావడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇందులో వైఎస్ పాత్రకు ది గ్రేట్ ఇండియన్ యాక్టర్, ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి అంగీకరించడంతో అందరు షాకయ్యారు. ఇక టైటిల్ డిజైన్ నుంచి అచ్చు వైఎస్ హావభావాలు, చేతులెత్తి నమస్కారం చేయడం, పంచెకట్టు.. ఇలా ప్రతి ఒక్కటి ఈ మూవీపై అంచనాలను బాగా పెంచాయి. ఇందులో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రకు జగపతిబాబుతో పాటు అనసూయ, సుహాసిని వంటి వారు నటిస్తుండటంతో అవి స్లో పాయిజన్‌లా జనాల మెదడులోకి ఎక్కుతున్నాయి.
ఇందులో జగన్ పాత్రను ఆయనే స్వయంగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని కూడా భారీగా చేయడానికి యూనిట్ సిద్దం అవుతోంది. ఈ వేడుకకు జగన్‌నే ముఖ్య అతిథిగా పిలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ ఇటీవలే పాదయాత్ర ముగించుకుని పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. జగన్ ఇచ్చే డేట్‌ని బట్టి జనవరి చివరి వారంలోగానీ, ఫిబ్రవరి 1,2 తారీఖుల్లో గానీ ఈ వేడుక జరిగే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.