ఓ నిర్మాతకు వచ్చిన హిట్స్ ఆయా నిర్మాతల డెసిషన్ మేకింగ్‌ని నిర్ణయిస్తాయే గానీ వారి అభిరుచిని తెలియజేసే చిత్రాలంటూ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని లెక్కలోకి తీసుకోకపోవడం బాధాకరమే అవుతుంది. ఇక శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ అధినేత దిల్‌రాజుకి తెలుగులో మంచి అభిరుచి, కథల, దర్శకుల ఎంపికలో మంచి జడ్జిమెంట్ ఉన్నాయనేది నిర్వివాదాంశం. యూత్‌ని, మాస్, ఫ్యామిలీని రంగరించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఇక విషయానికి వస్తే ‘దిల్’ చిత్రాన్ని ఈయన తన సహచరుడు గిరితో కలిసి నిర్మించాడు. ఆ చిత్రమే ఆయన ఇంటిపేరుగా మారింది. తాజాగా ఈ సంక్రాంతికి ఆయన 25కోట్ల లిమిటెడ్ బడ్జెట్‌తో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో తీసిన ‘ఎఫ్ 2’ చిత్రం సైలెంట్ కిల్లర్‌గా వచ్చి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, ఇంకా స్టడీగా కొనసాగుతోంది.
తాజాగా దిల్‌రాజు మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు నేను 31 చిత్రాలను నిర్మించాను. వీటిలో నాకు బాగా నచ్చినవి మాత్రం ఏడు చిత్రాలే. ఆ జాబితాలోకి ‘ఆర్య, బొమ్మరిల్లు, కొత్తబంగారు లోకం, మిస్టర్ పర్‌ఫెక్ట్, బృందావనం, శతమానం భవతి, ఎఫ్2’ చిత్రాలు వస్తాయి. ఈ ఏడింటిలో మొదటి స్థానం దేనికి అని అడిగితే మాత్రం ‘బొమ్మరిల్లు’ చిత్రం పేరే చెబుతాను. ఎందుకంటే ఈ చిత్రం అన్ని కుటుంబాల వారిని కదిలించింది’ అని చెప్పుకొచ్చాడు.
ఇక దిల్‌రాజు మెచ్చిన చిత్రాలను తీసుకుంటే అవన్నీ లిమిటెడ్ బడ్జెట్‌తో వచ్చి భారీ ఆదాయాలను మిగిల్చిన చిత్రాలే అని చెప్పాలి. కానీ ఆయన అభిరుచిని చాటిన చిత్రాల విషయంలో మల్టీస్టారర్స్‌కి మరలా తెరతీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ఆకాశమంత, గగనం’ వంటి చిత్రాలు ఉన్నాయి. కానీ వాటిని ఆయన విస్మరించడం కాస్త ఆశ్చర్యకరమే. మొత్తానికి తన మొదటి స్థానం మాత్రం ‘బొమ్మరిల్లు’కి ఇవ్వడం మాత్రం సమంజసమేనని చెప్పాలి.