ఏ ముహూర్తాన రజనీకాంత్, కృష్ణ, పవన్‌కళ్యాణ్ వంటివారు తమ చిత్రాలు భారీ డిజాస్టర్స్ అయితే సినిమాని కొన్న వారికి నష్టాలు పూడ్చే మంచి పనిని మొదలుపెట్టారో గానీ అది ఇప్పుడు వికృతరూపం దాలుస్తోంది. సినిమాతో సంబంధం లేకుండా ఫలానా స్టార్ ముందు చిత్రం 50కోట్లు అమ్ముడయితే తదుపరి చిత్రం 70కోట్లు అనే స్థాయిని నిజానికి బయ్యర్లే తీసుకుని వచ్చారు. దీనివల్ల ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయో ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది.
రజనీ లింగా నుంచి కాలా వరకు ఇదే పరిస్థితి. మరోవైపు బ్రహ్మోత్సవం, స్పైడర్, అజ్ఞాతవాసి, నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా, కథానాయకుడు వరకు ఇది కొనసాగుతూనే ఉంది. నాట్ రీఫండబుల్ ప్రకారం ఇష్టపడి కోట్లు ఎక్కువ పెట్టి కొని తర్వాత రోడ్లకు ఎక్కడం సరైన పద్దతి కాదు. తాజాగా అల్లుఅర్జున్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
నిజంగా జయాపజయాలకు అతీతంగా వరుస చిత్రాలు తీసే నిర్మాతలు తమ బయ్యర్ల బాగోగులను కూడా చూసుకుంటారు గానీ చెడ్డ పేరు తెచ్చుకోరు. నష్టపరిహారం డబ్బు రూపేణా ఇవ్వకపోయిన తమ తదుపరి చిత్రాలను నష్టపోయిన వారికే ఇస్తూ ఉంటారు. అల్లుఅర్జున్ తాజాగా మాట్లాడుతూ.. నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అయిన సమయంలో మౌనంగా ఉన్నది కేవలం డిస్ట్రిబ్యూటర్ వినోద్‌రెడ్డేనని, కాబట్టే ఆయన విడుదల చేస్తోన్న లవర్స్‌డే (ఒరు ఆధార్ లవ్) వేడుకకి వచ్చా..అని చెప్పాడు.
ఇక దీనికి విరుద్దమైన పరిస్థితి నిర్మాత దానయ్యకి ఎదురవుతోంది. వినయ విధేయ రామ తో నష్టాలు వచ్చినందున బయ్యర్లకు నష్టాలను పూడ్చాలని ఆయన భావిస్తూ ఉంటే.. మాకు నష్టపరిహారం వద్దు.. ఆర్.ఆర్.ఆర్ చిత్రం హక్కులు ఇస్తే చాలని అంటున్నారట.