సినిమా నిర్మాణంలో అందునా భారీ స్టార్స్, బిగ్ బడ్జెట్ చిత్రాలకు భారీ సెట్టింగ్స్ ఎంతో అవసరం. ఎందుకంటే స్టార్ హీరోల చిత్రాలను నేచురల్ లోకేషన్లలలో తీయాలంటే జనాలను అదుపు చేయడం సామాన్యం కాదు. ఇక ఈమద్య కాలంలో తీసుకుంటే మహేష్‌బాబుతో ఆయన అన్నయ్య రమేష్‌బాబు నిర్మించిన ‘అర్జున్’ చిత్రం కోసం మధుర మీనాక్షి సెట్‌ని వేశారు. ఆ సినిమా షూటింగ్ తర్వాత కూడా దానిని ప్రజల సందర్శనార్థం చాలా కాలం అలాగే ఉంచారు. ఇక సెట్టింగ్‌లు వేయడంలో దిట్ట అయిన గుణశేఖర్‌కి ఈ విషయంలో మంచి డిమాండ్ ఉంది.
‘బాహుబలి’ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్టింగ్‌ను ఇప్పటికీ సందర్శకులు బాగా ఎంజాయ్ చేస్తూ లాభాలు తెచ్చిపెడుతున్నారు. పలు పౌరాణిక, జానపద, ఫాంటసీ సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్స్ కూడా ఆ సెట్‌లోనే జరుగుతూ ఉంటాయి. మంచు ఫ్యామిలీ నిర్మించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’లోని గంధర్వమహల్ సెట్‌లో ఆ తర్వాత బెల్లంకొండ సురేష్‌తో పాటు పలువురు చిత్రాలు తీశారు. రెంట్ కట్టలేదని బెల్లంకొండతో మంచు ఫ్యామిలీకి గొడవలు కూడా జరిగాయి.
‘మనం’ చిత్రం కోసం నాగార్జున సైతం ఓ సెట్‌ని వేశాడు. అందులో సుశాంత్ చిత్రం, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాల షూటింగ్‌లు కూడా జరిగాయి. తర్వాత అగ్నిప్రమాదంలో ఈ సెట్ కాలిపోయినా కూడా ఇన్సూరెన్స్ డబ్బు నాగ్‌కి బాగానే వచ్చిందని వార్తలు వచ్చాయి. రామ్‌చరణ్-సుకుమార్‌ల ‘రంగస్థలం’లోని సెట్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇక ‘బిగ్‌బాస్ సీజన్1’ కోసం హిందీ బిగ్‌బాస్ సెట్‌ని వాడుకున్నారు. సీజన్2 కోసం అన్నపూర్ణ ఏడెకరాలలో సెట్ వేశారు. దీనిలో ప్రస్తుతం పలు చిన్న చిత్రాల, టివీ సీరియల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇలా భారీ చిత్రాలు, ఇతర వాటి కోసం ఎంత ఖర్చుతో సెట్టింగ్‌లు వేసినా వాటికి కాస్త కొత్త కవరింగ్ ఇస్తూ నిర్మాతలు ఆ వ్యయాన్నే కాదు.. రాయల్టీ, రెంట్‌లతో బాగానే సొమ్ము చేసుకుంటూ ఉండటం మన నిర్మాత, దర్శకుల తెలివికి అద్దం పడుతోంది. ఇది చిన్న చిత్రాల వారికి, టీవీసీరియల్స్‌వారికి ఎంతో ఉపయోగంగా ఉన్నాయనే చెప్పాలి.