ఆవేశంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే తరువాత బాధపడటం తప్ప చేసేదేమీవుండదు. ఆ విషయం సోనూసూద్ వల్ల మరోసారి నిజమని తేలింది. తెలుగు, తమిళ భాషలతో పాటు సోనూసూద్‌కు బాలీవుడ్‌లోనూ మంచి పేరున్న విషయం తెలిసిందే. అదే పేరు అతనికి చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న `మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ`లో నటించే అరుదైన అవకాశాన్ని అందించింది. అయితే ఆ అవకాశాన్ని తన అనాలోచిత నిర్ణయంతో వదుకోవాల్సి వచ్చిందని ఇప్పుడు ఫీలవుతున్నాడు. కంగన రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ మొదలుపెట్టి చివరలో వదిలేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బాధ్యతల్ని కంగన రనౌత్ తీసుకుని సినిమాను పూర్తి చేయాలని పూనుకుంది.
కంగన డైరెక్షన్‌లో నేను నటించడం ఏంటి? అని ఫీలైన సోనూ ఈ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. తన స్థానంలో మరో నటుడిని తీసుకుని అప్పటి వరకు చిత్రీకరించిన సోనూసూద్ వెర్షన్‌ని పక్కన పెట్టి కంగన మళ్లీ షూట్ చేసింది. అన్ని అవాంతరాలను దాటి `మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ`ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ విషయం తెలిసి తన అనాలోచిత నిర్ణయాల వల్ల తను కోరుకున్న సినిమా నుంచి అర్థాంతరంగా బయటికి వచ్చానని ఇప్పుడు ఫీలవుతున్న సోనూసూద్ బృందంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ చాలా శ్రమించారని, ఇలాంటి సినిమాలో నేను లేనందుకు ఆ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే వుంటుందని ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. `నేను కంగన వల్ల ఈ సినిమా వదులుకున్నానని జరిగిన ప్రచారంలో నిజం లేదని, రోహిత్ షెట్టి `సింబా` కారణంగానే `మణికర్ణిక` చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ సినిమా టీమ్ అందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, వారి కష్టానికి తగ్గట్టుగా `మణికర్ణిక` భారీ విజయాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం.