రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సినిమా స్టార్స్ మాత్రమే కాదు... ఎవరైనా విమర్శల నుంచి తప్పించుకోలేరు. రాజకీయాలు మాట్లానంతవరకు క్రిస్టియన్ మతస్తులు మత ప్రచారకుడు కె.ఎ.పాల్‌ని దైవంగా భావించే వారు. ఆయన ఆశీర్వాదం కోసం క్యూకట్టి అదే జీసస్ ఇచ్చిన ఆశీసులుగా భావించేవారు. కానీ ఈయన రాజకీయలను నెత్తికి ఎత్తుకుని, వైయస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు చేసి నవ్వుల పాలయ్యాడు. వైఎస్, పాల్ ఇద్దరు క్రైస్తవులే అయినా మత ప్రచారకునిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న పాల్‌ని వదిలి ఆ మతస్తులు వైఎస్ వెనుకే నిలబడ్డారు. ఇక వైఎస్ మరణం తర్వాత కూడా పాల్ తనతో పెట్టుకోవడం వల్ల వైఎస్‌కి ఏ గతి పట్టిందో చూడండని వ్యాఖ్యలు చేశాడు.
ఇక ప్రతి ఎన్నికల ముందు ఎంట్రీ ఇచ్చి నవ్వుల పాలు కావడం పాల్‌కి అలవాటుగా మారింది. త్వరలో ఏపీ అసెంబ్లీ, దేశ లోక్‌సభ ఎన్నికలు జరుగనుండటంతో కమెడియన్ పాల్ మరోసారి రంగంలోకి దిగాడు. తాను స్థాపించిన ప్రజాశాంతి పార్టీ ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమంటున్నాడు. మరోవైపు తనని చంపేందుకు చంద్రబాబు, జగన్‌లు కుట్ర పన్నుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. హిందుపురంలో బాలకృష్ణకి పోటీగా ఓ యాంకర్‌ని నిలపనున్నానని ప్రకటించాడు. ఒకానొక సందర్భంలో రాంగోపాల్‌వర్మ తన పాదాలకు మొక్కాడని, ఆయనకు తాను ఆశీర్వాదం ఇచ్చానని ప్రకటించి, అనవసరంగా తన కంటే మెంటల్ అయిన వర్మతో పెట్టుకున్నాడు.
దాంతో వర్మ మరింత సెటైరిక్‌గా స్పందిస్తున్నాడు. ఆయన ఆ ఇంటర్వ్యూలో పాల్ పాడిన పాటను తన ట్విట్టర్‌లో పెట్టాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది. పాల్ పాట విని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు.. పాల్ వంటి జోకర్‌ని కాళ్లకు నమస్కరించే నెపంతో ఆయన కాళ్లు పట్టుకుని లాగాలని భావించాను. అలా ఆయన తలకు దెబ్బ తగిలితే అయినా ఆయన మెదడు పనిచేస్తుందని అలా చేశానంటూ వర్మ కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు పాల్ మాత్రం తన ధోరణి ఆపలేదు. తాను అమితాబ్‌ని ప్రాణాపాయం నుంచి తప్పించాను. ట్రంప్‌ని గెలిపించాను. ప్రపంచంలో 15కు పైగా పెద్ద పెద్ద యుద్దాలను నేనే ఆపాను. ప్రపంచంలోని ముస్లిలందరినీ నేనే కాపాడాను అంటూ చెబుతున్నాడు.
ఇక వర్మ ట్విట్టర్‌లో పెట్టిన పాల్ పాటపై హీరో మంచు మనోజ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘సార్.. ఇది చరిత్రాత్మకమైన వీడియో. నేను ఈ పాటను పాడేందుకు ఎంతగానో ప్రయత్నించాను. కానీ నావల్ల కాలేదు. ప్రపంచంలోనే ఇది గొప్ప పాట’ అంటూ పాల్‌కి జోకర్‌గా అభివర్ణిస్తూ, వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.