బయోపిక్ అంటే జీవితం మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా, తమ కోణంలోనైనా చూపించి తీరాలి. అలా వీలుకాదు అనుకున్నప్పుడు మెయిన్‌పాయింట్‌ని వివాదాలు లేకుండా ఎంచుకోవాలి. ఈ విషయంలో ‘కథానాయకుడు’లో మిస్ అయిన లాజిక్‌ని ‘యాత్ర’ దర్శకుడు మహి.వి.రాఘవ్ తెలివిగా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి బయోపిక్ అంటే అందులో ప్రచారంలో ఉన్న పలు విషయాలను తప్పకుండా టచ్ చేయాలి. రాయలసీమ ఫ్యాక్షనిజంలో వైఎస్ కుటుంబానికి ఉన్న పాత్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఇతరులు ముఖ్యమంత్రులు అయిన ప్రతి సారి వైఎస్ వారిని ఎలా దెబ్బకొట్టాలా? అని ఆలోచించి అసంతృప్తి రాజేస్తూ వచ్చాడు. ఏదో ఒక గొడవలు సృష్టించి వారిని పదవి నుంచి తప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇక వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మరణించే వరకు చూపిస్తే అందులో జగన్ అవినీతి ఆరోపణలను కూడా ప్రస్తావించాలి. అందుకే మహి.. వైఎస్ బయోపిక్‌ని కాకుండా కేవలం ఆయన హయంలో గొప్పదశని, పాదయాత్ర ద్వారా ఎలా మెప్పించాడు? అనే వాటినే మెయిన్‌పాయింట్‌గా ఎంచుకుని తన తెలివిని చూపాడనే చెప్పాలి. ఇక కాస్టింగ్‌పరంగా కూడా మమ్ముట్టి, జగపతిబాబు, అనసూయ, సుహాసిని వంటి వారిని ఎంచుకున్నాడు. అంతేగానీ వైసీపీకి చెందిన నటీనటులకు ఒకటి అరా తప్పితే పెద్దగా చాన్స్ ఇవ్వలేదు. ఈ కారణాల వల్లనే బహుశా ‘యాత్ర’కి ఎలాంటి కటింగ్స్ లేకుండా సెన్సార్ క్లీన్‌యు సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ప్రశంసలు కూడా ఇచ్చిందని సమాచారం.
కేవలం వైఎస్‌లోని పాజిటివ్ యాంగిల్‌నే ‘యాత్ర’ ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది నిజమేనని టాక్. మరోవైపు ఈ చిత్రానికి క్లీన్‌యు సర్టిఫికేట్ ఇచ్చి, ప్రశంసలు కురిపించడం ద్వారా కేంద్రంలోని బిజెపి, టిఆర్‌ఎస్ సహా పలు రాజకీయ కారణాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. సెన్సార్‌పై మరీ ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోక్యం మరీ ఎక్కువైందని వస్తున్న విమర్శలు నిజమేనని, అందుకే ‘యాత్ర’ విషయంలో మంచిప్రమోషన్స్ వచ్చేలా చేస్తున్నారని వాదన చేయడానికి ఇది ఆస్కారం కల్పించింది. మొత్తానికి ‘మహానాయకుడు’కి వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘యాత్ర’ గట్టిగా కొరకరాని కొయ్యలుగా మారాయనడం, వాటి విడుదల కూడా దగ్గరదగ్గరగానే ఉండటంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది.