ఎవరు ఏమన్నా కూడా బయోపిక్‌లలో ఉండాల్సింది నిజాయితీ, నిబద్దత, పరిశోధన... అది ‘కథానాయకుడు’లో లేకుండా పోయాయి. కేవలం ఎన్టీఆర్ బయోపిక్ అయినంత మాత్రాన, అందునా ఆయన తనయుడు నందమూరి నటసింహం బాలకృష్ణ నటించి, నిర్మించినంత మాత్రాన అందరూ ఎగబడి చూస్తారనుకోవడం భ్రమే అని ఈ చిత్రం నిరూపించింది. ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి చిత్రాలలో కూడా కొన్ని సినిమాటిక్ సీన్స్ ఉన్నాయి. కానీ అవి కూడా ప్రేక్షకులను అలరించేలా, వాస్తవానికి దగ్గరగా చూపించడం రాఘవేంద్రరావుకే చెల్లింది. ‘కథానాయకుడు’లో కూడా పలు సినిమాటిక్ సీన్స్ ఉన్నాయి.
ఎన్టీఆర్ నటించిన ‘పెళ్లి చేసి చూడు’ చిత్రంలోని పాట షూటింగ్‌కి ఆయన భార్య బసవతారకం రావడం, ఎన్టీఆర్‌కి ఆమె హార్మోనియం నేర్పించడం వంటివి కేవలం అభూత కల్పనలే అని నాటి వ్యక్తులు స్పష్టంగా, ఆధారాలతో సహా చెబుతున్నారు. ఇలా పనికి మాలిన సీన్స్‌ని సినిమాటిక్ చేయడం కంటే మంచి ఎమోషన్స్, నవరసాల విషయంలో ఇలాంటి జాగ్రత్త తీసుకుని ఉంటే కాస్త మాస్‌నైనా మెప్పించి ఉండేది. ఇక స్టార్ హీరోల చిత్రాలలో వారి ప్రమేయం వల్ల దర్శకుల తప్పు లేకపోయినా ఆయా ఫలితాలు ఎంతగా వారిని ఇబ్బంది పెడతాయో పాపం క్రిష్‌ని చూస్తే అర్ధమవుతుంది.
బహుశా ఇదే కారణం వల్ల తేజ తప్పుకుని మంచి పని చేశాడనే చెప్పాలి. ఇక ‘మహానాయకుడు’ని కూడా ఎలాంటి నిజాలు చూపించకుండా దాటవేసే ధోరణిలోనే తీయడం ఖాయమని తేలిపోతోంది. అలా చేస్తే నిజమైన ఫీల్ మిస్ అయిపోవడం ఖాయం. ఈ చిత్రం తీస్తానని చెప్పినప్పుడు బాలయ్యని మీడియా ఎన్టీఆర్ జీవితం మొత్తం చూపిస్తారా? అని ప్రశ్నిస్తే ఎన్టీఆర్ బయోపిక్‌ని ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో, ఏయే సీన్స్ తీయాలో నాకు తెలుసు.. మీరు చెప్పాల్సిన పని లేదని మండిపడ్డాడు. ఇప్పుడు నిజం బాలయ్యకి అర్ధమై ఉంటుంది.
తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో మూడో స్థానంలో నిలిచిన ఈ చిత్రం కొన్న బయ్యర్లు పూర్తిగా నష్టపోయారు. దాంతో బాలయ్య ‘కథానాయకుడు’ తీసుకున్న బయ్యర్లకే ‘మహానాయకుడు’ని ఉచితంగా ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ‘కథానాయకుడు’కి ఏకంగా 50కోట్ల నష్టం వచ్చింది. అది మొత్తం ‘మహానాయకుడు’ భర్తీ చేస్తుందని అనుకోవడం కల. ఇక సినిమా కొన్న బయ్యర్లకు రెండో పార్ట్‌ని ఉచితంగా ఇస్తున్నారు సరే.. ఆ సినిమాని వందలు పెట్టి కొని చూసిన ప్రేక్షకులకు కూడా రెండో పార్ట్ టిక్కెట్లను ఉచితంగా ఇస్తారా? అని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.
మరోవైపు క్రిష్ పరిస్థితి దయనీయంగా ఉంది. తన అభిరుచికి అనుగుణంగా మంచి చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ఒకవైపు ‘కథానాయకుడు’ డిజాస్టర్‌తో తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఎన్నో ఆశలతో తీసిన ‘మణికర్ణిక’ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ‘మణికర్ణిక’కు పోటీగా వస్తోన్న బాల్‌ఠాక్రే బయోపిక్ మీదనే ఎక్కువ క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కి అఖిల్ ‘మిస్టర్‌మజ్ను’ అడ్డంకిగా మారింది. తెలుగు ‘మణికర్ణిక’ వెర్షన్‌కి ఏమాత్రం బజ్ రావడం లేదు. ఇక ‘ఎఫ్ 2’ జోరు మామూలుగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ‘కథానాయకుడు’, ‘మణికర్ణిక’ల తర్వాత వచ్చే ‘మహానాయకుడు’ కూడా క్రిష్ పరువుని తీస్తుందేమో అనే అనుమానాలు కలుగుతుండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.