టాలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజ్ అయిన క్రేజీ చిత్రాలు మరే సీజన్ లో రిలీజ్ అవ్వవు. అలానే సంక్రాంతికి తెలుగులో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి తరువాత అటువంటి చిత్రాలు రిలీజ్ అవ్వాలంటే సమ్మర్ సెలవుల్లోనే. ఏప్రిల్, మే నెలల్లో ప్రతీ వారానికీ భారీగా విడుదల అయ్యేందుకు షెడ్యూల్ రెడీ చేసుకుంటాయి. ఎప్పటిలానే ఈసారి కూడా కొన్ని సినిమాలు షెడ్యూల్ రెడీ చేసుకున్నాయి.. థియేటర్స్‌లో దిగేందుకు. అందులో ముఖ్యంగా ఏప్రిల్ నెలలో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల గురించి చూద్దాం.
ఏప్రిల్‌లో భారీ చిత్రం ‘మహర్షి’ రిలీజ్ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చేయడంతో మిగిలిన సినిమాలు తమ డేట్స్ ని ఫిక్స్ చేసుకుని ఎప్పుడు రావాలో డిసైడ్ అయ్యాయి. మొదట మహర్షి సినిమా ఏప్రిల్ 5 న వస్తుందని అనుకుంటే కొన్ని కారణాలు వల్ల ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ ప్లేస్ లో నాగచైతన్య-సమంతల సినిమా ‘మజిలీ’ని కన్ఫమ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 5 న మజిలీ రిలీజ్ అవుతుంది.
ఈ రెండు సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకోవడంతో చిన్న సినిమాలు కూడా తమ డేట్స్ ని ఫిక్స్ చేసుకున్నాయి. ఏప్రిల్ 12న సాయిధరమ్ తేజ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ రానుంది. అదే రోజు తమిళ డబ్ మూవీ సూర్య నటించిన ‘ఎన్జీకే’ కూడా రానుంది. ఆ తర్వాతి వారానికి నాని చిత్రం ‘జెర్సీ’తో పాటుగా మరో తమిళ డబ్బింగ్ సినిమా ‘కాంచన-3’ కూడా రిలీజవుతుంది. ఇక మహర్షి సినిమా రిలీజ్ అయ్యే వారంలో ఏ సినిమా పోటీకి లేదు. మరి మే నెలలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.