మెడికల్ టెర్మనాలజీలో ఇలాంటి రోగం ఏమీ లేదు కానీ.. సినిమాటిక్ టెర్మనాలజీలో మాత్రం "సెకండ్ సినిమా సిండ్రోమ్" అనేది చాలా పాపులర్. ఈ సిండ్రోమ్ బారిన పడకుండా గట్టెక్కిన డైరెక్టర్స్ ను వేళ్ళతో లెక్క వేయవచ్చు. ఇంతకీ ఈ సిండ్రోమ్ విశిష్టత ఏమిటంటే.. మొదటి సినిమాతో కమర్షియల్ లేదా క్రిటికల్ హిట్ అందుకున్న ఎంత పెద్ద దర్శకుడైనా సరే ఈ సిండ్రోమ్ పుణ్యమా అని సెకండ్ సినిమాతో దారుణమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఇలా సెకండ్ సినిమాతో సూపర్ ఫ్లాప్ అందుకొని మూలనపడ్డ దర్శకుల సంఖ్య చాలా పెద్దది.
అందుకే.. తన మొదటి చిత్రమైన తొలిప్రేమతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా దండిగా అందుకున్న వెంకీ అట్లూరి సెకండ్ సినిమా అయిన మిస్టర్ మజ్ను మీద తెగ డౌట్ పడుతున్నారు జనాలు. ట్రైలర్ విడుదలయ్యాక ఆరెంజ్ సినిమాలా ఉందని టాక్ రావడంతో ఆ అనుమానం మరింత బలపడింది. అసలే థియేటర్లలో ఎఫ్2 ఇరగాడేస్తోంది. ఈ తరుణంలో విడుదలవుతున్న మిస్టర్ మజ్నుకి ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు సినిమాను కనీస స్థాయిలో పట్టించుకోరు కూడా. అసలే పరిచయ చిత్రం ఘోరంగా ఫ్లాపై ఉండడం, సెకండ్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి ఉండడంతో మూడో సినిమా మిస్టర్ మజ్నుపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు అఖిల్. మరి మిస్టర్ మజ్ను హిట్టై వెంకీని సెకండ్ సినిమా సిండ్రోమ్ నుంచి బయట పడేయడంతోపాటు.. హీరోగా అఖిల్ కు కమర్షియల్ హిట్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.