మన తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ రాజకీయంగా ఎదిగిన విధంగా మరెవ్వరు ఎదగలేకపోయారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి వారు సైతం ఏదో కాంగ్రెస్, బిజేపిల తరపున ఎన్నికయ్యారు. ఇక మెగాస్టర్ చిరంజీవి సైతం ప్రజారాజ్యం పెట్టి, నడపలేక, తన హవా చాటలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రి కాగలిగినా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పటి స్టార్స్‌లో బాలయ్య చంద్రబాబు దయ వల్ల ఎమ్మెల్యేగా ఉన్నా ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు తక్కువ. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ విషయం వేచిచూడాలి...! అయితే పూర్తిగా మెజార్టీ సాధించి సీఎం అయ్యే చాన్స్ మాత్రం లేదనే చెప్పాలి. ఇక మహేష్, ప్రభాస్‌లు రాజకీయాలంటే దండం పెడుతున్నారు.
ఇక విషయానికి వస్తే తమిళనాట సినీ జీవులకు ఫేడవుట్ తర్వాత కనిపించే ఏకైక రంగం రాజకీయాలే. వీరిని సినీ నిరుద్యోగులనే చెప్పాలి. శరత్‌కుమార్, విజయ్‌కాంత్, ఖుష్బూ, కార్తీక్, భాగ్యరాజా నుంచి ఏకంగా శివాజీగణేషన్ సైతం పెద్దగా రాణించలేదు. ఇక ప్రస్తుతం కమల్‌హాసన్, రజనీకాంత్‌లు రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ అజిత్, విజయ్‌లు. విజయ్‌కి భవిష్యత్తులో రాజకీయాలలో ఉందని స్వయంగా ఆయన తండ్రే ప్రకటించాడు. తెలుగులో పవన్‌కళ్యాణ్ ఎలాగో తమిళంలో తల అజిత్ అలా. వీరిద్దరి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి.
కానీ రాజకీయంగా మాత్రం ఇద్దరికి అసలు పోలికే లేదని చెప్పాలి. ఎందుకంటే పవన్ రాజకీయాలపై ఆసక్తిని చూపి, సొంతగా పార్టీ పెట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. అదే అజిత్ విషయానికి వస్తే స్వయంగా అమ్మ జయలలిత సైతం తాను బతికున్నప్పుడే తనకు కొడుకు కంటే ఎక్కువైన అజిత్ నా వారసుడు అని ప్రకటించింది. దాంతో జయ తర్వాత అజిత్ అన్నాడీఎంకే పగ్గాలు చేపడతాడని ప్రచారం సాగింది. ఫాలోయింగ్ పరంగా, క్రేజ్‌పరంగా, మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా అజిత్‌కి తమిళనాట తిరుగులేదు. నిజానికి అమ్మ మరణించిన వెంటనే అజిత్ అన్నాడీఎంకేలోకి వచ్చి ఉంటే పన్నీర్‌సెల్వం, పళని స్వామి, శశికళలను కూడా కాదని ఎమ్మెల్యేలందరు అజిత్‌కి మద్దతు తెలిపేవారే.
కానీ ఆయన ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు. తాజాగా ఆయన రాజకీయాలపై మాట్లాడుతూ, నాకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని కుండబద్దలు కొట్టాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నాకు సాధారణంగా జీవించడమే ఇష్టం. అందుకే ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాలలోకి వచ్చే ప్రశ్నే లేదు. అంతేకాదు.. నేను సాధారణ ఓటరుగా క్యూలో నిలబడి ఓటేయడమే నాకు ఇష్టం అని తేల్చిపారేయడంతో అజిత్‌పై ఇక రాజకీయ పరమైన వార్తలకు ఆయన చెక్ పెట్టాడనే చెప్పాలి.