ఏది ఏమైనా కూడా కొన్ని చిత్రాలలో ఎంత హింస, శృంగారం, విచ్చలవిడితనం ఉన్నా కూడా అభ్యంతరం పెట్టని సెన్సార్‌బోర్డ్ అలాంటి సన్నివేశాలే ఉండే మరికొన్ని చిత్రాలకు అడ్డంకులు కలిగిస్తూ ఉంటుంది. దీనితో సెన్సార్ బోర్డ్‌లపైనే సినిమా వారికి నమ్మకం పోయింది. మరికొన్ని చిత్రాలలో ఏమీ లేకపోయినా రాజకీయ కక్ష్యలతో కూడా సినిమాలను అడ్డుకుంటూ ఉంటారు. ఇదే పరిస్థితి కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ మొదటి పార్ట్ విషయంలో తమిళనాట జరిగింది. ‘పద్మావత్’ అనే చిత్రం రాజ్‌పుట్ మహిళలను అద్భుతంగా చూపించినా కూడా సినిమా చూడకుండానే కర్ణిసేన నానా రాద్దాంతం చేసింది. తలలు తెగనరకాలనే వరకు విషయం వెళ్లింది. ఇదే చిత్రం పలు ఆంక్షల నడుమ విడుదలైన తర్వాత రాజ్‌పుత్ వారే గర్వంగా చెప్పుకున్నారు. థియేటర్ల నిండా రాజ్‌పుత్ మహిళలు థియేటర్లను బుక్ చేసుకుని సంప్రదాయ వస్త్రాలతో వచ్చి ఎంతో గొప్ప చిత్రంగా అభివర్ణించారు. అలాగని పూర్తిగా ఇబ్బందికరమైన సినిమాలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో ఇటీవల ‘రా’ చిత్రాల పేరుతో వచ్చి మంచి విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్100’లు కూడా ఉన్నాయి.
ఇక విషయానికి వస్తే కన్నడలో బెంగుళూరుకి సమీపంలో ఉండే దండుపాళ్యం వద్ద ఉండే హైవే దోపిడీ ముఠాల వికృత చేష్టలను చూపిస్తూ ‘దండుపాళ్యం’ వచ్చింది. నిజంగా నేడు ‘రా’ చిత్రాల తాకిడి ఎక్కువ కావడానికి ఇది కూడా కారణం అయింది. కన్నడతో పాటు తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ బాగా ఆడటంతో మొత్తం ఇప్పటికీ మూడు దండుపాళ్యాలు వచ్చాయి. తాజాగా ‘దండుపాళ్యం 4’ షూటింగ్ పూర్తి చేసుకున్నా సెన్సార్ వారు దీనికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇందులో అసభ్యకరమైన, జుగుప్సాకరమైన, మరీ విపరీతమైన లైంగిక దృశ్యాలు, తలలు నరుక్కోవడం వంటివి నిండి ఉన్నాయని, కనీసం దీనికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా వీలు కాదని, సినిమాని సెన్సార్ చేస్తే టైటిల్స్, విశ్రాంతి, శుభం కార్డులు మినహా ఏమీ ఉండవని సెన్సార్ అంటోంది.
ఇప్పటికే ఈ పంచాయతీ నిర్మాతల మండలి నుంచి కేంద్ర సెన్సార్ బోర్డు వరకు వెళ్లింది. త్వరలో నిర్మాతలు కోర్టుకి కూడా వెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నారు. అసలు సినిమా చూడకుండానే సెన్సార్ నిరాకరిస్తూ, కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని సెన్సార్‌బోర్డుపై నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ విషయంలో సెన్సార్ తన పని తాను చేసుకుపోవాల్సిందే. ఇక ఇప్పటికైనా సెన్సార్ విషయంలో మన దర్శక నిర్మాతలు స్వయం నియంత్రణ పాటిస్తే బాగుంటుందని చెప్పాలి.