ఎన్టీఆర్ బయోపిక్‌ని ఆయన ముద్దుల తనయుడు నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎంతో ఆనందపడ్డారు. అయితే ముందుగానే ఈ చిత్రం ఎలా ఉంటుంది? చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని కైవసం చేసుకోవడం నుంచి వైస్రాయ్ ఉదంతం, లక్ష్మిపార్వతితో రెండో వివాహం వంటివి ఉండవని కొందరు పెదవి విరిచారు. పూర్తి జీవితాలను చూపించి వాటికే బయోపిక్స్ అనే పదం వాడాలి. పూర్తిగా జీవితం చూపించడం సాధ్యం కానున్నా కీలక ఘట్టాలను తమ కోణంలో ఆలోచించి దర్శక, నిర్మాతలు చూపించాలనే గుణపాఠాన్ని ‘కథానాయకుడు’ నిరూపించింది. ఎన్నో అంచనాలతో పాజిటివ్ టాక్, రివ్యూలు, విశ్లేషణలు వచ్చినా ఈ చిత్రాన్ని నందమూరి, టిడిపి అభిమానులు కూడా పూర్తిగా చూసినట్లు లేదని కలెక్షన్లను పరిశీలిస్తే అర్ధం అవుతుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘అజ్ఞాతవాసి, స్పైడర్’ల తర్వాత అత్యంత డిజాస్టర్ అయిన చిత్రంగా దీనికి మూడోస్థానం దక్కింది.
మరి ఈ అపజయాన్ని ముందుగానే కోరుకున్నట్లు డిజాస్టర్ కావడం బహుశా లక్ష్మీపార్వతికి అంత కంటే ఎక్కువగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకి కలిగించినంత ఆనందం బహుశా నందమూరి బద్ద విరోధులకు కలిగించి ఉండదు. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభించి, నిజమైన బయోపిక్ తమదేనని, ఇందులో ఎన్టీఆర్ జీవితంలోని నిజాలను పచ్చిగా చూపిస్తున్నామని తన ప్రమోషన్స్‌తో అదరగొట్టిన వర్మ తాజాగా ‘కథానాయకుడు’ చిత్రంపై స్పందించాడు. ‘కథానాయకుడు’ చిత్రాన్ని నేనింకా చూడలేదు. ట్రైలర్ చూశాను. కానీ నాకు ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కనిపించలేదు. ఏదో బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడు కాబట్టి కొన్ని పోలికలు ఉండవచ్చే గానీ ఎన్టీఆర్‌లా బాలయ్య కనిపించలేకపోయాడు...నాకు ఇందులో ఎన్టీఆర్ కాదు.. ఆయన కొడుకే కనిపించాడు...’ అని సెటైర్ వేశాడు.
తన చిత్రం టీజర్‌ని ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ విడుదల చేస్తామని చెప్పిన ఆయన, తాను తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్రను పోషించే వ్యక్తిని తానేమీ బాలీవుడ్ నుంచి తేలేదని, ఆయన గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని, కాకపోతే ఎన్టీఆర్ ఎలా ఉండేవారు? ఎలా మాట్లాడేవారు? వంటి విషయాలపై మాత్రం ఆయనకు తాను కాస్త తర్ఫీదుని ఇచ్చానని తెలిపాడు. మొత్తానికి బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కంటే తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం కోసమే ఎక్కువగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారనేది నిజమని, దీనిని సోషల్‌మీడియాలోని వారితో పాటు ఎవరైనా అంగీకరిస్తారని తెలపడం కొసమెరుపు.
ఇక ఇప్పటికే లక్ష్మీపార్వతి, చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌ల పాత్రధారులని పరిచయం చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తెల్లని, పచ్చని వస్త్రాలు ధరించి భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోని విడుదల చేయడంతో ఇది వైరల్‌గా మారింది.