మణిరత్నంని లెజెండ్ అనే చెప్పాలి. క్రియేటివ్ జీనియస్ అయిన ఆయన ఈ మధ్య పెద్దగా సంచలన విజయాలను నమోదు చేసి ఉండకపోవచ్చు. కానీ దక్షిణాది చిత్రాలకు జాతీయ గుర్తింపును తెచ్చిన ఘనత ఈయనదే అని ఒప్పుకోవాలి. ఆయన ఓ చిత్రం తీసినా అదో కళాఖండమే అవుతుంది. ఓ సీన్‌ని తీసి ఇది మణిరత్నం సినిమా అని గుర్తు పట్టేంతగా ఆయన తనదైన ముద్రను వేసుకున్నాడు. ప్రతిషాట్ ఓ అద్భుతం. అయితే ఈమధ్య ఆయనకు ‘ఓకే బంగారం, నవాబ్’లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాయి. నాగార్జునకు ‘గీతాంజలి’ ఇచ్చినా రజనీ, మమ్ముట్టి, అరవింద్‌స్వామిలతో ‘దళపతి’ తీసినా, అరవింద్‌స్వామి, దుల్కర్‌సల్మాన్, షారుఖ్‌ఖాన్, అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్, కమల్‌హాసన్ ఇలా ఆయన ప్రతి ఒక్కరితో అద్భుతమైన అవుట్‌పుట్‌ని రాబట్టుకుంటాడు.
కానీ ఆయన ఫ్లాప్‌లలో ఉన్నాడని కాబోలు రామ్‌చరణ్ నుంచి నాని వరకు ఆయనతో చిత్రాలు చేయాలని ఉన్నా చేయలేకపోయారు. రామ్‌చరణ్‌ని మాస్ చిత్రాలు కాదు.. జీవితం చివరలో నేను చేసిన చిత్రాలు ఇవి అని గర్వంగా చెప్పుకునే చిత్రాలంటూ ఉండాలని చెప్పి ‘దృవ, రంగస్థలం’ వంటి విభిన్న చిత్రాలు చేయమని ప్రోత్సహించిన క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుంది. ఇక హీరోయిన్లే కాదు.... హీరోలు కూడా ఆయన చిత్రంలో నటించాలని కలలు కంటారు. గతంలో నాని నుంచి ఎందరో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం మణిరత్నం ‘నవాబ్’ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా దాదాపు 150 నుంచి 200కోట్ల బడ్జెట్‌తో తమిళంలో వచ్చిన అద్భుత నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా ఓ చిత్రం చేయనున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఇది రూపొందనుంది. ప్రధానపాత్రకు చియాన్ విక్రమ్‌ని , కీలకపాత్రలకు అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్‌లతో పాటు ముఖ్యపాత్రలకు కోలీవుడ్ స్టార్స్ విజయ్, శింబులను ఒప్పించాడు.
ఇదే సమయంలో తెలుగు నుంచి కూడా ఓ హీరోని మంచి పాత్రకి ఎంచుకోవాలని అనుకుంటున్నాడట. ఆయన దృష్టిలో నేచురల్‌స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండలు ఉన్నారు. నాని, విజయ్‌దేవరకొండలకు కూడా కోలీవుడ్, బాలీవుడ్‌లలో గుర్తింపు తెచ్చుకొని, తమ మార్కెట్‌ని విస్తృతం చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఈ దిశగా వారు కొన్ని ప్రయత్నాలను కూడా చేశారు. కానీ నాని, విజయ్‌లు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినా మణిసార్ అడిగితే వారు కాదనలేరనే ప్రచారం సాగుతోంది. మరి మణికి ఎవరు ఓకే చెబుతారో వేచిచూడాల్సివుంది...!