టాలీవుడ్‌లో పలువురు అభిరుచి కలిగిన నిర్మాతలైన రామానాయుడు, దేవివరప్రసాద్, కాట్రగడ్డ మురారి, ఎమ్మెస్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, రామోజీరావు, అశ్వనీదత్, కె.యస్.రామారావు, ఎస్.గోపాల్‌రెడ్డి... ఇలా ఎందరో కాలం చేయడమో లేక నిర్మాతలుగా ఫేడవుట్ అవ్వడం, ఏదో ఒకటి అరా చిత్రాలు తీస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం అల్లుఅరవింద్, దిల్‌రాజు, యువి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి వారు మాత్రం ఆ లోటును పూడుస్తున్నారు.
ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ విషయానికి వస్తే వారు స్టార్ హీరోలు, దర్శకుల చిత్రాలతో అతి తక్కువ వ్యవధిలోనే బ్లాక్‌బస్టర్స్ అందించారు. వారు నిర్మించిన చిత్రాలు కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు.. వారి అభిరుచిని, వైవిధ్యభరిత కథల ఎంపికను నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం ఏ హీరో అయినా ఆ బేనర్‌లో చిత్రం చేయాలంటే వెంటనే ఓకే చెబుతారు. దర్శకులు కూడా వారితో చిత్రాలు చేసేందుకు క్యూలో ఉంటున్నారు. ఇక రవితేజ-శ్రీనువైట్లతో తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’, నాగచైతన్య ‘సవ్యసాచి’లు నిరుత్సాహపరిచాయి. కానీ వారు మాత్రం భారీ చిత్రాలతో పాటు మీడియం సినిమాలను కూడా వరుసగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం వీరు సాయిధరమ్‌తేజ్-కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో ‘చిత్రలహరి’, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’, సంతోష్ శ్రీనివాస్‌తో తీస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఇంతేకాదు.. విజయ్ దేవరకొండతో మరో చిత్రం చేసేందుకు, నేచురల్‌స్టార్ నానితో చిత్రానికి కూడా డేట్స్ సంపాదించారు. తాజాగా వారు ‘తొలిప్రేమ’, అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లని తీసిన వెంకీ అట్లూరితో ఓ చిత్రం కమిట్ అయ్యారు. వెంకీ అంటే యూత్ హీరోలకి, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు.
మరి మైత్రి మూవీస్ వెంకీ అట్లూరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ, నానిలతోనా? లేక మరో యంగ్ హీరోతో చేస్తారా? వంటి విషయాలన్నీ ‘మిస్టర్ మజ్ను’ రిలీజ్ తర్వాత తెలుస్తాయి. మొత్తానికి ఈ ఏడాది దాదాపు నాలుగైదు చిత్రాలను విడుదల చేసే ప్రయత్నంలో మైత్రి సంస్థ ఉంది. మొత్తానికి ఇలాంటి నిర్మాతలు వరుస చిత్రాలతో, మంచి ప్లానింగ్‌తో దూసుకుపోవడం అభినందనీయమనే చెప్పాలి.