`గమ్యం`, వేదం, `కంచె` చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న క్రిష్‌ను ఎన్టీఆర్ బయోపిక్ రెంటికి చెడ్డ రేవడిని చేసిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి అంటున్నారు సినీ జనం. బాలీవుడ్‌లో పేరున్న దర్శకులను పక్కన పెట్టి భారీ బడ్జెట్‌ని, భారీ తారాగణాన్ని చేతిలో పెట్టి చరిత్రాత్మక నేపథ్యంలో రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా `మణికర్ణిక` చిత్రాన్నిరూపొందించమని నిర్మాత కమల్‌జైన్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేశాడు క్రిష్. ఆ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసి ఎన్టీఆర్ బయోపిక్‌ని నేనే డైరెక్ట్ చేయాలన్న పట్టుదలతో, ఆశతో ఈ సినిమా కోసం వచ్చి తప్పు చేశాడా? అంటే ముమ్మాటికీ తప్పేచేశాడని జాతీయ స్థాయి సినీ విమర్శకులు క్రిష్‌పై మండిపడుతున్నారట.
తననని నమ్మి కోట్ల రూపాయల బడ్జెట్‌ని ఖర్చుపెట్టి సినిమా తీయమని నమ్మితే తనని నట్టేట ముంచాడని సదరు బాలీవుడ్ నిర్మాత క్రిష్‌పై మండిపడినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అతన్ని కాదని క్రిష్ తెరకెక్కించిన `ఎన్టీఆర్ కథానాయకుడు` ఈ ఏడాది అత్యంత డిజాస్టర్ చిత్రంగా నిలవడమే కాకుండా ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్‌లలోనూ దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకున్న తొలి సినిమాగా నిలవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెప్పుకోతగ్గ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి రాకపోవడం, ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ మాట దేవుడెరుగు... పెట్టిన పెట్టుబడిలో సగాన్ని కూడా రాబట్టకపోవడం ట్రేడ్ వర్గాలకే షాక్‌గా మారింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహానటుడి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాకు ఇంతటి దారుణ పరిస్థితి ఎదురుకావడానికి వెనుక దర్శకుడు క్రిష్‌తో పాటు టైటిల్ పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రధాన కారకులని వీరిద్దరిపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. దీనికితోడు ఈ సినిమాపై వస్తున్న విమర్శతు మామూలుగా లేవు. ఓ పాత్రికేయుడైతే ఈ చిత్రాన్ని చీల్చిఛెండాడి పోస్టు మార్టం చేసినంతపని చేయడం గమనార్హం. దీన్ని బట్టే `ఎన్టీఆర్ బయోపిక్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా క్రిష్ పాఠాలు నేర్చుకుంటే మంచిది. సినిమాని ఎంత ఫాస్ట్‌గా తీశామన్నది ఇక్కడ పాయింట్ కాదు. ఎంత ఆకట్టుకునే విధంగా తీశామన్నదే అసలు పాయింట్. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ తన పంథాను ఇక నుంచైనా మార్చుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.