నేడు సినిమాల విజయంలో టైటిల్స్ కూడా కీలకపాత్రలను పోషిస్తున్నాయి. జనాలను, అందునా వైవిధ్యం కోరుకునే వారిని కూడా తమ టైటిల్‌తో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. టైటిల్ బాగా క్యాచీగా ఉంటే సగం విజయం సాధించినట్లు, ఓపెనింగ్స్ రోజున టైటిళ్ల వల్ల కూడా థియేటర్‌కి ప్రేక్షకులు వచ్చేలా చేయడంలో ఇవి కీలకపాత్రలను పోషిస్తున్నాయి. ఇక యంగ్ హీరో నిఖిల్ విషయానికి వస్తే ‘సూర్య వర్సెస్ సూర్య, కిర్రాక్ పార్టీ’ చిత్రాలు నిఖిల్‌కి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత అంత పెద్ద హిట్స్‌గా నిలవలేదు. ముఖ్యంగా కన్నడలో దుమ్మురేపిన ‘కిర్రాక్‌పార్టీ’ రీమేక్ తెలుగులో నిరాశపరిచింది. అయినా నిఖిల్ తన తదుపరి చిత్రంగా తమిళ ‘కణితన్’ రీమేక్‌గా ‘ముద్ర’లో నటిస్తున్నాడు. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నిఖిల్ అర్జున్ సురవరం అనే జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నాడు.
తాజాగా ఆయన ఈ చిత్రం తొలి పోస్టర్‌ని కూడా విడుదల చేశాడు. కానీ ఈ చిత్రం టైటిల్‌ని ‘ముద్ర’ కాకుండా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం నిఖిల్ నిర్మాతల కంటే ముందుగా మరో నిర్మాత ఈ టైటిల్‌ని రిజిష్టర్ చేయడమే. తాజాగా ‘ముద్ర’ అనే టైటిల్‌తో జగపతిబాబు, పోసాని కృష్ణమురళి వంటి వారు కనిపిస్తూ ఈ మధ్య దిన పత్రికలో ఓ ప్రకటన కూడా వచ్చింది. అయితే గతంలో బాలకృష్ణ నుంచి కళ్యాణ్‌రామ్ వరకు, మహేష్‌బాబు నుంచి ఎందరో ఇలాంటి టైటిల్స్ తలనొప్పి ఏర్పడినప్పుడే ఏదో ఒకటి ఆ టైటిల్ ముందు చేర్చేవారు.
‘సాహస సామ్రాట్, కళ్యాణ్‌రామ్ కత్తి, మహేష్ ఖలేజా’ వంటివి ఈ కోవకి చెందినవే. అయితే అదే పనిని నిఖిల్ కూడా చేస్తాడా? లేక టైటిల్‌ని తన పాత్ర పేరు అయిన ‘అర్జున్ సురవరం’ అని మారుస్తాడా? అనేది చూడాలి. ముద్ర అనే టైటిల్ ఎంతో బాగుందని అనుకుంటున్న తరుణంలో ఇలా టైటిల్ తలనొప్పి రావడం గమనార్హం. ఇక సురవరం సుధాకర్‌రెడ్డి తరహాలో అర్జున్ సురవరం అని పెట్టినా అది కూడా ‘అర్జున్‌రెడ్డి’ తరహాలోనే వినిపిస్తోంది. మరి ఈ కొత్త టైటిల్ అన్వేషణ ఎలా సాగుతుందో వేచిచూడాల్సివుంది...!