దాసరి బతికున్నంత కాలం ఒకటే చెప్పేవాడు. డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. దర్శకులు స్టార్స్‌ని తయారు చేయగలరే గానీ ఏ స్టార్ కూడా ఒక్క స్టార్ డైరెక్టర్‌ని తయారు చేయలేడు అనేది ఆయన చెప్పే ఏకైక మాట. ఇందులో నిజం కూడా ఉంది. అదే మన నేచురల్‌స్టార్ నాని విషయానికి వస్తే దీనిని కాస్త మార్చి చెప్పుకోవాలి. నాని కొత్తభామలను, ఫ్లాప్ హీరోయిన్లను స్టార్ హీరోయిన్లుగా తయారు చేస్తాడే గానీ స్టార్ హీరోయిన్ల కోసం వెంటపడడు. ఆయన పనిచేసే దర్శకులు కూడా ఇదే సూత్రాన్ని, నాని మాటలను పాటిస్తూ ఉంటారు. ఇది ఆర్దికంగా, సమయం పరంగా కూడా మంచిది.
ఇక ప్రస్తుతం నేచురల్‌స్టార్ ‘కృష్ణార్జునయుద్దం, దేవదాస్’ ల తర్వాత మరలా తన పాత రూట్‌లోకి వచ్చి క్రికెట్ నేపధ్యంలో ‘జెర్సీ’ అనే చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో నాని తన తదుపరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించనున్నాడు. ‘మనం’తో ఇంటిలిజెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
నితిన్‌కి, నాగ్‌కి హిట్టిచ్చిన ఈ దర్శకుడు సూర్య హీరోగా తీసిన ‘24’, అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ చిత్రాలు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేక కమర్షియల్‌గా పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఇంటిలిజెంట్ స్టార్ అయిన నాని మరో జీనియస్‌ని వెంటపెట్టుకుని వస్తున్నాడంటే సమ్‌థింగ్ ఏదో ఉండే ఉంటుంది అనే నమ్మకం కలుగుతోంది. ఇందులో కూడా స్టార్ హీరోయిన్‌ని కాకుండా నితిన్‌తో ‘లై, ఛల్‌మోహన్ రంగ’ చిత్రాలు చేసి దెబ్బతిన్న భామ మేఘా ఆకాష్‌కి అవకాశం ఇచ్చారట. నాని.. అందుకే నాని దారి రహదారి అని, అందులో షార్ట్‌కట్స్ ఉండవని ఒప్పుకోవాల్సిందే.