స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా మొత్తానికి తమకంటూ ఓ గుర్తింపు, స్టార్ స్టేటస్ సంపాదించిన వారు మాత్రం నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌లే. కానీ మిగిలిన వారెవ్వరూ ఏమాత్రం రాణించలేకపోయారు. ఇక బాలనటునిగా బాబాయ్ ‘బాలగోపాలుడు’తో పరిచయమై, ఆ తర్వాత హీరోగా ఎంటర్ అయిన నందమూరి కళ్యాణ్‌రామ్ జయాపజయాలకు అతీతంగా వరుస చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. చాలా వాటిని తన ఓన్‌రిస్క్‌తో తానే నిర్మాతగా నిర్మించాడు. కానీ ‘అతనొక్కడే, హరేరామ్, పటాస్’ చిత్రాలు తప్ప ఆయనకు ఆస్వాదించే విజయాలు రాలేదు.
ముఖ్యంగా ‘పటాస్’ తర్వాత ఆయన దశ తిరుగుతుందని పలువురు భావించారు. కానీ అది దర్శకుడు అనిల్‌రావిపూడి పాత సబ్జెక్ట్‌ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా బాగా చూపించడం వల్లనే గానీ కళ్యాణ్‌రామ్ నటనాప్రతిభ వల్ల కాదని తేలింది. ఇక ‘కళ్యాణ్‌రామ్ కత్తి, ఓం త్రీ, షేర్, ఇజం, ఎమ్మెల్యే, నా నువ్వే’ వంటి ఎన్నో ఫార్ములా చిత్రాలు చేశాడు. ‘ఎమ్మెల్యే, నా నువ్వే’ చిత్రాలు విడుదలకు ముందు కాస్త అంచనాలు రేపినా విడుదలైన తర్వాత తుస్సుమన్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడుగా ప్రయత్నిస్తున్న ఈయన ఈసారి టైటిల్‌లోనే కావాల్సినంత కొత్తదనం తీసుకుని ‘118’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రంలోని పోస్టర్‌ని విడుదల చేసి అందులో తన బెర్త్‌ని ముందుగా మార్చి1నే బుక్ చేసుకున్నాడు. టైటిల్ చూస్తుంటే కాస్త కొత్తదనమే కనిపిస్తోంది. కళ్యాణ్‌రామ్ లుక్ కూడా ఏదో బాగా ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది. మంచి దమ్మున్న థ్రిల్లర్ చిత్రాలను ఇప్పుడు ప్రేక్షకులు స్టార్ వ్యాల్యూ లేకపోయినా ఆదరిస్తున్నారు. ఇక ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన నివేదాధామస్, ‘అర్జున్‌రెడ్డి’ ఫేం షాలినిపాండేలు అదనపు ఆకర్షణగా నిలవనున్నారు. గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అయినా కళ్యాణ్‌రామ్ సక్సెస్ ఆకలిని తీరుస్తుందో లేదో వేచిచూడాలి...!