ఆయన సూపర్ హిట్స్ కొట్టినప్పుడు రెస్పెక్ట్ పెరిగిందో లేదో తెలియదు కానీ.. ఫ్లాప్ ఇచ్చినప్పుడు మాత్రం రెస్పెక్ట్ తగ్గలేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ స్థాయిని క్రియేట్ చేసుకొన్న దర్శకుడు పూరీ జగన్నాధ్. అలాంటి దర్శకుడు ఇప్పుడు ఒక హిట్ కోసం అర్రలు చాచి ఎదురుచూస్తున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన మాస్ సినిమాలకు పక్కనపెట్టి ఎప్పుడైతే ప్రయోగాలు అంటూ ప్రయత్నించాడో అప్పుడే వరుస పరాజయాలు చవిచూశాడు పూరీ. ఆఖరికి తన కుమారుడు ఆకాష్ తో తెరకెక్కించిన మెహబూబా కూడా ప్రయోగాత్మక చిత్రమే కావడంతో బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. చిన్న గ్యాప్ తర్వాత రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే పేరుతో ఒక మాస్ మసాలా సినిమా ఎనౌన్స్ చేశాడు పూరీ జగన్నాధ్.
ఈ చిత్రంలో రామ్ మన పూరీ రెగ్యులర్ హీరోల్లా మాస్ గా కనిపిస్తున్నప్పటికీ.. ఒక డిఫరెంట్ మరియు టిపికల్ మెంటల్ ఇష్యూతో బాధపడుతుంటాడట. అందుకే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో డబుల్ సిమ్ కార్డ్ అని గట్టిగా రిజిష్టర్ అయ్యేలా రిలీజ్ చేశాడట పూరీ. రామ్ ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ లేకా ఆ తరహా రుగ్మతి ఉన్న కథానాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది.
మరి పూరీ ప్రయోగం ఫలిస్తుందా లేదా అని తెలియదు కానీ.. రామ్ ఫ్యాన్స్ తోపాటు పూరీ అభిమానులు కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాస్త టెన్షన్ పడుతున్నారు. ఛార్మీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.