మన ప్రాంతీయ చిత్ర పరిశ్రమల్లో మాత్రమే కాదు యావత్ భారతీయ పరిశ్రమల్లోనే మెగా ఫ్యామిలీలో ఉన్నంత మంది హీరోలు ఎక్కడా ఉండరేమో. ఇప్పటికే డజను మంది హీరోలున్న ఈ ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు హీరోలు ఎంట్రీకి సిద్ధమవుతుండగా.. ఇంకొందరు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొంటున్నారు. కొన్నేళ్ళ తర్వాత కేవలం మెగా ఫ్యామిలీ నుంచే నెలకో సినిమా రిలీజైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది. ఇంతమంది హీరోలు ఉండడం పుణ్యమా అని కొత్త దర్శకులు, నిర్మాతలు కూడా పుట్టుకొస్తున్నారు. ఒకందుకు ఈ పద్ధతి మంచిదే అనుకోండి.
కాకపోతే.. ఈమధ్యకాలంలో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు అంతగా ఆడడం లేదు. ఒకరి తర్వాత ఒకరు అంతకుమించిన డిజాస్టర్లు ఇస్తూ నేనంటే నేను గొప్ప అన్నట్లు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మొదలుకొని వరుణ్ తేజ్ అంతరిక్షన్ వరకూ, ఇలా మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, సాయిధరమ్ తేజ్ అంటూ మెగా హీరోలందరూ వరుస ఫ్లాప్స్ తో బాధపడడమే కాక వారి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు, కొంటున్న డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు మిగుల్చుతున్నారు.
గత కొన్నేళ్లుగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ లు హీరోలుగా రూపొంది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైన సినిమాల నష్టాలు మొత్తం కలిపితే దాదాపు 700 కోట్ల పైచిలుకే అని వినికిడి. దాంతో బడా ప్రొడ్యూసర్స్ తప్ప కొత్త నిర్మాతలు కనీసం సినిమా జోలికి కూడా పోవడం లేదు. మరి ఈ మెగా మొనగాళ్ళు ఇలాగే కంటిన్యూ అయ్యి నిర్మాతలకు ఇంకా భారే నష్టాలు కలిగించి ఇండస్ట్రీని భయపెడతారా లేక తమ ధోరణి మార్చుకొని నష్టాలు మిగిలిచిన నిర్మాతల కోసం మళ్ళీ హిట్ సినిమాలు చేసి పెడతారా అనేది వేచి చూడాలి.