నిన్నటితరం ప్రేక్షకులతోపాటు నేటితరం ఆడియన్స్ ను కూడా తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంటున్న ఏకైక నటి ఎవరైనా ఉంటే అది రమ్యకృష్ణ మాత్రమే. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకున్న క్రేజ్ కి ఇప్పటికీ కొందరు యువ హీరోయిన్లు కుళ్లుకుంటారు. అయితే.. మొన్న విడుదలైన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆవిడకి తెలుగులో మళ్ళీ భారీ అవకాశాలు లభించలేదు కానీ.. తమిళంలో మాత్రం అత్తారింటికి దారేది రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో శింబు కు అత్తగా టైటిల్ పాత్ర పోషిస్తోంది రమ్యకృష్ణ.
నిన్నమొన్నటివరకూ వెండితెర, బుల్లితెరలకు మాత్రమే పరిమితమైన మన శివగామి.. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలోకి కూడా అడుగిడనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి మరియు ఎక్స్ హీరోయిన్ అయిన జయలలిత జీవితం ఆధారంగా రూపొందనున్న ఓ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ నటించనుంది. మూడు సీజన్లుగా రూపొందనున్న ఈ సిరీస్ లో యంగ్ జయలలితగా మరో హీరోయిన్ నటించనుండగా.. సీనియర్ జయలలితగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు రమ్యకృష్ణ ప్రస్తుతం సినిమాలకు అందుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే డబుల్ ఎమౌంట్ అందుకొందని వినికిడి. సో, రమ్యకృష్ణ ఈ వెబ్ సిరీస్ లో గనుక బిజీ అయిపోయే.. కొన్నాళ్లపాటు ఆమెను వెండితెర మీద మిస్ అవుతామన్నమాట.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే.. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా మొదలెట్టిన సినిమాల పరిస్థితి ఏమిటా అని చర్చించుకుంటున్నారు జనాలు.