నేటి రోజుల్లో సినిమాలు తీసేటప్పుడు ఎవరి జీవితాన్నో చూచాయగా చూపించి, వివాదం సృష్టిస్తే కాసుల పండుగే. అయితే దానికి రక్తచరిత్ర విషయంలో వర్మ వేసినట్లు చూచాయగా ఇందులోని సన్నివేశాలన్ని కల్పితాలు.. ఎవరిని ఉద్దేశించినవి కావు అని వేస్తే చాలు లీగల్ గీగల్ జాన్తానై అని చెప్పాలి.
ఇక విషయానికి వస్తే గతంలో వర్మ తన చిత్రానికి శ్రీదేవి అనే టైటిల్ పెడితే శ్రీదేవి, బోనీకపూర్‌లు నానా రాద్దాంతం చేశారు. లోకంలో ఒకే ఒక్క శ్రీదేవి అనే పేరుతో ఆమె ఒక్కతే ఉన్నట్లుగా ఉంది బోనీకపూర్ తాజా రాద్దాంతం. కన్నుగీటుడు మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ మొదటి చిత్రం ఒరు ఆధార్ లవ్ ఇంకా విడుదల కాలేదు. ఇది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఎందరో స్టార్స్ అడిగినా నో చెప్పిన ప్రియ ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది.
ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రంలోని టీజర్‌లో కొన్ని సీన్స్ శ్రీదేవి బాత్‌టబ్‌లో మరణించడం వంటి అంశాలు కనిపించాయి. దాంతో బోనీ ఇది శ్రీదేవి బయోపికే అంటూ లీగల్‌నోటీసులు పంపాడు. దీనిపై దర్శకుడు ప్రశాంత్ కూడా ధీటుగానే స్పందించాడు. లీగల్ నోటీసులు వచ్చిన మాట నిజమేనని, దానికి లీగల్‌గానే సమాధానం ఇస్తామని తెలిపాడు. శ్రీదేవి అనేది ఎందరికో ఉండే కామన్ పేరు అని.. ప్రతిది ఆ శ్రీదేవే అనుకుంటే ఎలా అంటూ సెటైరిక్‌గా స్పందించాడు. కాగా ప్రియా నటిస్తున్న రెండో చిత్రమే బాలీవుడ్‌లో వివాదానికి కారణమవ్వడం విశేషం.