తమిళనాడుకి చెందిన సంచలన నటి రాధికాఆప్టే.. పుట్టింది తమిళనాడులోని వేలూరులో అయినా బాలీవుడ్, మరాఠీ, మలయాళం, బెంగాళీ వంటి పలు భాషా చిత్రాలలో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక దక్షిణాదికి ఈమె వర్మ రక్తచరిత్ర ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ వంటి చిత్రాలతో పాటు తమిళ-తెలుగు భాషల్లో రూపొందిన రజనీ కబాలి, ప్రకాష్‌రాజ్ ధోని వంటి చిత్రాలలో అద్భుతంగా నటించింది. బహుశా ఈమద్య కాలంలో కాస్టింగ్‌కౌచ్ గురించి ఓ స్టార్ హీరో మీద తీవ్ర ఆరోపణలు చేసిన మొదటి నటి రాధికాఆప్టేనే అని చెప్పాలి.
ఓ రాజకీయ పార్టీకి చెందిన బలవంతుడైన స్టార్ తనని వేధించాడని, కానీ రజనీ చాలా మంచివాడని చెబుతూ పలు ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చే వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడమో, లేక ఆమె చెప్పేట్లుగా తెలుగులో వేధింపులు ఎక్కువ అనే కారణం వల్లనో ఆమె ఇటీవల బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీస్తున్న వెబ్‌సిరీస్‌లలో కూడా కంటిన్యూగా నటిస్తోంది. మధ్యలో నగ్నంగా కనిపించే కొన్ని సీన్స్ ఉన్న వాటిల్లో కూడా నటించి సంచలన తారగా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఆమె జాంబరియా సినిమాలో నటిస్తోంది. విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో అమ్మడు నటన గురించి బోలేడు విషయాలు చెప్పింది. తనకెప్పుడు ఆసక్తిని కలిగిస్తూ ఉండే స్ఫూర్తిదాయకమైన పనులు చేస్తూ ఉండటం ఇష్టం అట. నిత్యం ఏదో ఒకటి అన్వేషించేలా జీవితం లేకపోతే ఛాలెంజింగ్‌రోల్స్ చేయలేమని చెప్పుకొచ్చింది. అయితే తాను డేటింగ్ చేస్తోన్న విదేశీప్రియుడు, వారి ప్రేమ వ్యవహారం అడిగితే మాత్రం ఆ ఒక్కటి అడగొద్దంటోంది. కిందటి ఏడాది కెరీర్ బాగా సాగడంతో ఈ ఏడాది కూడా జాంబరియాతో తన సక్సెస్ ట్రిప్ మొదలవుతుందని ఎంతో నమ్మకంగా చెబుతోంది మరి...!