దక్షిణాదిలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన సినీ ఫ్యామిలీలలో నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వంటి వాటితో పాటు కన్నడలో కంఠీరవ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి కూడా అంత పేరుంది. ఆయన కుమారులు కూడా కన్నడ నాట సంచలన హీరోలు. ఇక రాజ్‌కుమార్ బతికున్న రోజుల్లో ఎన్టీఆర్‌కి, రాజ్‌కుమార్‌కి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. సమకాలీనులుగా వీరిద్దరు రెండు పరిశ్రమలను ఒంటి చేత్తో శాసించారు.
ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్‌కి, రాజ్‌కుమార్‌కి మద్య ఉన్న సాన్నిహిత్యమే బాలకృష్ణ, రాజ్‌కుమార్ తనయుల మధ్య ఉంది. ఆ అనుబంధంతోనే బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో నటించిన ప్రతిష్టాత్మక తన 100వ చిత్రం గౌతమీపుత్రశాతకర్ణిలో శివరాజ్‌కుమార్‌ని నటింపజేశాడు. బుర్రకధగా సాగే ఎపిసోడ్‌లో ఈ మూవీలో శివరాజ్‌కుమార్ కనిపిస్తాడు. ఇక కన్నడలో సీనియర్ స్టార్ అయిన శివరాజ్‌కుమార్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 124 చిత్రాలలో నటించాడు. ఆయన 125వ ప్రతిష్టాత్మక చిత్రంగా త్వరలో భైరతి రణగల్ రూపొందుతోంది.
శ్రీముత్తు సినీ క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి నార్తన్ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కన్నడలో ప్రస్తుతం అందరి చూపు ఇదే చిత్రంపై ఉంది. సంఖ్యాపరంగా ఈ చిత్రం ప్రత్యేకతను చాటుకోనుండటంతో శివరాజ్‌కుమార్ ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఇందులో ఓ కీలకమైన అతిథి పాత్ర ఉండటంంతో ఆ పాత్రను బాలకృష్ణని చేయమని శివరాజ్‌కుమార్ ప్రత్యేకించి అడిగాడట. తమ మధ్య వున్న మంచి అనుబంధం కారణంగా బాలయ్యని అడిగిన వెంటనే ఆయన ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ఇక ఇందులో పలు దక్షిణాదిభాషలకు చెందిన ప్రముఖ స్టార్లనే కాక, తోటి కన్నడస్టార్స్‌ని కూడా నటించేందుకు ఒప్పించి, ఈ మూవీని తన కెరీర్‌లో మరుపురానిదిగా చేయాలని శివరాజ్‌కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టాడట.