కంటి చూపుతో కుక్కల్ని కంట్రోల్ చేయడం, చప్పట్లు కొడితే కుర్చీలు వచ్చేయడం వంటి సన్నివేశాలు 90ల కాలంలో వచ్చినప్పుడు హీరోల మాస్ ఇమేజ్ ముందు ఆ సన్నివేశాల్లో లాజిక్ ను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల తీరు మారింది. సెన్సిబుల్ గా కంటే లాజికల్ గా సినిమా చూసి ఆనందించడానికి ఇష్టపడుతున్నారు మన ఇండియన్ ఆడియన్స్. అందుకే ఈమధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాల కంటే ఎక్కువగా కాన్సెప్ట్ ఫిలిమ్స్ పెద్ద విజయం సాధిస్తున్నాయి. అందుకు నిదర్శనాలు 2017, 2018లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రాలు. చిన్న సినిమాలుగా వచ్చినవే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవగా.. భారీ బడ్జెట్ తో రూపొంది, భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు మాత్రం యావరేజ్ లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొత్త నీరు వస్తోంది అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రేక్షకులు కాంబినేషన్స్ ను, భారీ స్థాయి మేకింగ్ ను కాక కాన్సెప్ట్ ను బట్టి చిత్రాలను ఆదరిస్తున్నారు.
నవతరం దర్శకులు ఈ విషయాన్ని బాగానే గ్రహించారు కానీ.. సీనియర్ డైరెక్టర్లు మాత్రం ఈ విషయాన్ని ఇంకా అంత సీరియస్ గా తీసుకొన్నట్లు కనిపించడం లేదు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సంక్రాంతి సినిమాలు. సీనియర్ డైరెక్టర్స్ బోయపాటి శీను, క్రిష్ తెరకెక్కించిన "వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు" చిత్రాలకు మిశ్రమ స్పందన లభించింది. వినయ విధేయ రామ సినిమా ఫ్లాపై కలెక్షన్స్ రాబట్టలేకపోతే.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు విశేషమైన స్పందన, పాజిటివ్ రివ్యూస్ వచ్చిన తర్వాత కూడా మినిమమ్ కలెక్షన్స్ లేవు. పైగా.. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భారీ నష్టాలు రావడంతో సెకండ్ పార్ట్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని తమకు ఫ్రీగా ఇవ్వాలని కోరారు అయితే.. యువ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్, అనిల్ రావిపూడీలు మాత్రం ఆడియన్స్ పల్స్ తెలుసుకొని ఒకరు వింటేజ్ రజనీకాంత్ ను మరొకరు వింటేజ్ వెంకటేష్ ను ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసి బాక్సాఫీస్ దగ్గర హల్ చల్ చేస్తున్నారు. "పెట్ట, ఎఫ్ 2" చిత్రాలు పెద్ద కొత్తగా ఏమీ ఉండవు, కేవలం ఆడియన్స్ కోరుకొనే మాస్ ఎలివేషన్స్ & ఫన్ ఉంటుంది అంతే. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా మన అగ్ర మరియు సీనియర్ దర్శకులు అర్ధం చేసుకొని ముందుకెళితే మంచిది.