చిన్న చిత్రాలు, వైవిధ్యభరితమైన, ఉపయోగకర చిత్రాలతో క్రిష్ దర్శకత్వ కెరీర్ స్టార్ట్ అయింది. మొదటి చిత్రం గమ్యంతోనే జీవితసారాన్ని ఆయన చెప్పిన తీరు అందరినీ ఆశ్చర్యచకితులని చేసింది. ఆ తర్వాత కూడా వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె వంటి చిత్రాలు కమర్షియల్ విజయాలను పక్కనపెడితే క్రిష్‌లోని ఆలోచనాధోరణి, ఆయన అభిరుచిని చాటి చెప్పాయి. ఇక తమిళ రమణ, తెలుగు ఠాగూర్‌కి రీమేక్‌గా బాలీవుడ్‌లో గద్దర్ చిత్రం తీశాడు. క్రియేటివ్ దర్శకులకి రీమేక్ చిత్రాలలో పెద్దగా వెసులుబాటు ఉండదని, తామనుకున్నది చూపించే స్కోప్ తక్కువగా ఉంటుందని శేఖర్‌కమ్ముల కహాని, క్రిష్ గద్దర్‌లు నిరూపించాయి. కానీ క్రిష్‌కి కమర్షియల్ దర్శకునిగా పేరు వచ్చింది మాత్రం బాలకృష్ణ వల్లనే అని చెప్పాలి. గౌతమి పుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ చిత్రాన్ని ఏమాత్రం వాసి, రాశిలో రాజీపడకుండా అత్యంత పొదుపుపైన బడ్జెట్, అనుకున్న సమయంలో అతి తక్కువ వ్యవధిలో చిత్రాన్ని తీసి తనని తాను నిరూపించుకున్నాడు.
ఇక ఆ తర్వాత బాలీవుడ్‌లో కంగనారౌనత్ తాను చేయదలచిన ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత చరిత్ర అయిన మణికర్ణికను క్రిష్ చేతుల్లో పెట్టింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో దాని నుంచి వైదొలగవలసి వచ్చింది.ఆ తర్వాత ఆ బాధ్యతను నెత్తిన పెట్టుకున్న కంగనా సోనూసూద్ క్యారెక్టర్‌ని రీషూట్ చేయడం, కథలో పలు మార్పులు చేర్పులు చేయడం తనని బాధించిందని,కానీ తన చిత్రాన్ని వివాదం చేయకుండా ఉండేందుకే తాను మౌనం వహించానని తాజాగా క్రిష్ తన మనసులో మాటను చెప్పాడు. అదే ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే మణికర్ణిక తీరుకి వ్యతిరేకంగా జరిగింది. ఈ బయోపిక్‌కి ముందుగా బాలకృష్ణ తేజని దర్శకునిగా ఎంచుకున్నాడు. తేజ కొన్ని నెలల పాటు ఈ స్క్రిప్ట్ మీద కూర్చుని వర్క్ చేశాడు. నటీనటులను కూడా ఎంపిక చేసుకుని ప్రారంభోత్సవం కూడా చేశాడు.
అంతలో తేజ తప్పుకోవడంతో దీనిలోకి క్రిష్‌ని ఎంటర్ చేయించాడు బాలయ్య.దీని గురించి క్రిష్ మాట్లాడుతూ, ఈ చిత్రం నుంచి తేజ ఎందుకు తప్పుకున్నాడో నాకు తెలియదు. కానీ ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ బయోపిక్‌లో నా పేరు టైటిల్ కార్డ్స్‌లో రావడం నా పూర్వజన్మ సుకృతం.అయితే వెంటనే నేను షూటింగ్ మొదలుపెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో చాలా మంది తేజ స్క్రిప్ట్‌నే నేను తీశానని భావిస్తున్నారు. కానీ తేజ స్క్రిప్ట్ నా చేతికి వచ్చిన తర్వాత నేను దానిని పూర్తి మార్చి వేసి నాదైన శైలిలో పూర్తి మార్పులు చేశాను. నేడు క్రిష్ వల్లనే ఈ బయోపిక్‌కి ఇంత మంచి క్రేజ్ వచ్చిందని ప్రశంసలు లభిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.