మనవారు హిట్ ఫార్ములా అంటూ వినయ విధేయ రామ వంటి కథలనే వండివారుస్తున్నారు. ఏదో ఇలాంటి పక్కా మాస్, అర్దం పర్ధం లేని హీరోయిజంతో వచ్చిన చిత్రాలు, గతంలో తాము తీసిన చిత్రాలు హిట్ అయ్యాయి కదా... అని అనే మూసలో పోతూ అద్బుతంగా ఉంటుందని చెబుతూ వస్తున్నారు. కానీ నిజంగా యూనివర్శల్ పాయింట్‌తో వచ్చి ఒక భాషలో విజయవంతమైన చిత్రాలకు ప్రాంత, మత, భాషా బేధాలు ఉండవు. దానిని బాహుబలి, దంగల్ నుంచి అర్జున్‌రెడ్డి వరకు నిరూపిస్తూనే ఉన్నాయి. అలాంటి సార్వజనీనమైన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం కెజిఎఫ్. తక్కువ బడ్జెట్, క్వాలిటీ ఉండని చిత్రాలుగా చిన్నచూపు చూసే కన్నడ చిత్రాల సత్తా ఏమిటో ఈ మూవీ నిరూపించింది.
బడా బడా సినీ వారసత్వ స్టార్స్, ఎంతో కాలంగా ఉన్న కిచ్చాసుదీప్‌లు, దర్శన్‌లు కూడా సాధించలేని ఫీట్‌ని యంగ్ కన్నడ రెబెల్‌స్టార్ యష్ సాధించాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కన్నడ చిత్రాలు కూడా 100కోట్లను వసూలు చేయగలవని, అంతే కాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సత్తా చూపగలవని ఆయన నిరూపించాడు. యష్ అంబరీష్ మృతితో పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని అభిమానులను కలవకపోతే దానికి మనస్థాపం చెందిన ఓ అభిమాని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన బాధాకరమే అయినా అది యష్‌కి ఉన్న క్రేజ్‌ని నిరూపిస్తోంది. ఓ కన్నడ చిత్రం బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్ జీరో వసూళ్లను కూడా దాటడం రానున్న కొత్త ఒరవడికి దిక్సూచిగా నిలుస్తోంది.
తాజాగా ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలలో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రేక్షకులు యష్‌కి, కెజిఎఫ్‌కి బ్రహ్మరధం పట్టడం చూస్తుంటే మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు హిట్ ఫార్ములా పేరుతో రొటీన్ రొంపకొట్టుడు చిత్రాలను నమ్ముకోకుండా ముందుకు పోవాలనే నీతి కనిపిస్తోంది. కథ, కథనాలు పక్కాగా ఉంటే చిన్న చిన్న పొరపాట్లను ప్రేక్షకులు పట్టించుకోరని ఇప్పటికే ఎఫ్2 వంటి చిత్రాలు నిరూపిస్తున్న తరుణంలో ఇటీవల అద్భుతంగా తెలుగు చిత్రాలు ఉంటున్నాయనే పేరును కొందరు తమ భావదారిద్య్రంతో చెడగొట్టడం బాధాకరమనే చెప్పాలి.