చేయి కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం.. అలాగే జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేస్తే ఏం ఉపయోగం? ఇది దేనికి చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇది రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం గురించి. ఈమధ్య చాలా చిత్రాలలో నిడివి పెరిగిందనే పేరుతో సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని సీన్లు, ల్యాగ్ సీన్లను ఎడిట్ చేస్తున్నారు. మరికొందరు ఎంత పెద్ద నిడివి ఉన్నా కూడా నిడివి సమస్య అని భయపడి మంచి సీన్స్‌ని తీసేసి విడుదల చేస్తున్నారు.
దీనితో అసలు ఎడిటింగ్ అనే శాఖకు అర్ధం పర్ధం లేకుండా పోతోంది. ఇప్పుడు వినయ విధేయ రామ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. కొందరు వినయ విధేయ రామ చిత్రంలోని ట్రైన్ సీన్, విలన్ల తలలు నరికితే వాటిని గద్దలు వచ్చి పట్టుకుని వెళ్లే సీన్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఆ సీన్స్‌ని వెనకేసుకుని వస్తూ బాహుబలి చిత్రంలో తాటి చెట్లనురబ్బర్‌లా వచ్చి విల్లుగా ప్రభాస్ ఉపయోగించుకునే సీన్స్ వంటివి ఉదహరిస్తూ,దానికి లేని తప్పు ఈ చిత్రంలోని సీన్స్‌కి ఎందుకు అంటూ పెడవాదన చేస్తున్నారు.
ఫాంటసీతో కూడిన చిత్రాలలో నేల విడిచి సాము చేసినా, కథ, కథనం, ఎమోషన్స్ బాగా ఉన్నప్పుడు వాటిని పట్టించుకోరు. కానీ నేటికి చెందిన సమకాలీన కథలలో, అందునా సాంఘిక చిత్రాలలో ఇలాంటివి ఉంటే మాత్రం జీర్ణించుకోలేరు. ఏదిఏమైనా అన్నయ్య ప్రాణభయంతో అరిచినప్పుడు ఎక్కడో ఎయిర్‌పోర్ట్‌లో ఉండే చరణ్ తన అన్నయ్య కోసం ఎయిర్‌పోర్ట్ అద్దాలు పగులగొట్టి, ఏకంగా ట్రైన్ మీదకి దూకడం, కొద్ది గంటల్లోనే బీహార్ చేరడం, మద్యలో పచ్చబొట్లు వేయించుకోవడం వంటి సీన్స్‌పై వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి.
మరి ఈ ఫీడ్‌బ్యాక్ బోయపాటి వరకు చేరినట్లుంది. దాంతో ఏ, బి సెంటర్లలో ఈ సీన్‌ని తీసి వేశారట. కానీ సి సెంటర్ ప్రేక్షకులకు నచ్చుతుందని కాబోలు అక్కడ ఇంకా ఉంచారట. సి సెంటర్ల ప్రేక్షకులు కూడా తెలివి మీరిన నేపధ్యంలో ఇంకా సి సెంటర్లలో ఆ సీన్‌ని ఉంచడం చూస్తే ప్రేక్షకుల అభిరుచిని ఈ చిత్రం యూనిట్ తప్పుగా అర్ధం చేసుకున్నట్లు అనిపిస్తోంది.