గ్లామర్ హీరోయిన్లు తమని కాస్త ముసలి పాత్రలో చూపిస్తామంటే ఒప్పుకోరు. అందుకే అలాంటి పాత్రలకు ఫేడవుట్ అయిన వారిని ఎంచుకుంటూ ఉంటారు. ఇక విషయానికి వస్తే అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన భారతీయుడు చిత్రంలో ముసలి కమల్‌హాసన్ పాత్రకే కాకుండా సుకన్య పాత్రకు కూడా ప్రోస్థటిక్ మేకప్‌తో ముసలి వయసు పాత్రలను చూపించారు. అవి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత దాదాపు భారతీయుడు స్టోరీనే కాస్త అటు ఇటుగా మలచి వైవిఎస్ చౌదరి నందమూరి బాలకృష్ణతో భారీ అంచనాలతో ఒక్క మగాడు చిత్రం తీశాడు.
ఇందులో బాలయ్యని ముసలి వేషంలో చూపించడంతో పాటు అప్పటికి స్టార్ హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన సిమ్రాన్ చేత ముసలి వేషం వేయించాడు. ఇక బాహుబలి పార్ట్ 1లో అనుష్కను రాజమౌళి ముసలిగా చూపించాడు. ఇక విషయానికి వస్తే చందమామ కాజల్ ఎంతో కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. మద్యలో అవకాశాలు రాక తెరమరుగు అయ్యే సమయంలో ఎన్టీఆర్ టెంపర్, మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెంబర్ 150, రానా-తేజల నేనే రాజు నేనే మంత్రి వంటి అనుకోని అవకాశాలు ఆమెని వరిస్తూనేఉన్నాయి.
ఇలాంటి సమయంలో ఆమె శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించనున్న భారతీయుడు సీక్వెల్‌కి ఎంపిక అయింది. శంకర్ చిత్రంలో అవకాశం అందునా లోకనాయకుడు కమల్‌తో అంటే అది నిజంగా అదృష్టమనే చెప్పాలి. అయితే ఇందులో రెండు విభిన్నమైన షేడ్స్ ఉండే పాత్రలను కాజల్ పోషించనుంది. ఒకటి ముసలి గెటప్ కాగా రెండోది యంగ్ హీరోయిన్‌గా. ముసలి గెటప్ కోసం విదేశాల నుంచి మేకోవర్ కోసం మేకప్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారు.
భారతీయుడు చిత్రంలో కమల్‌హాసన్ ద్యూయెట్ రోల్ పోషించగా, సుకన్య, మనీషా కోయిరాల వంటి ఇద్దరు హీరోయిన్లు నటించారు. కానీ దీని సీక్వెల్‌లో మాత్రం కాజల్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. మరి ఒకటి కమల్‌హాసన్ ముసలి పాత్రకు జోడీ కాగా, రెండోది ఆయనకు మనవడిగా నటిస్తున్న శింబుకి జోడీ అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో వెయిట్ చేయాల్సివుంది...!