అభిమానులకు ఆనందం వచ్చినా, కోపం వచ్చిన పతాక స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో వారు చాలా సార్లు విచక్షణ కోల్పోతూ ఉంటారు. దానికి వారు చెప్పే కారణాలు సమంజసమా? కాదా? అనేది కూడా ఆలోచించరు. గతంలో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి స్టార్స్‌కి బాగా ఇష్టమైన దర్శకులు మరో హీరోతో ఫ్లాప్ సినిమాని తీస్తే తమ అభిమాన హీరో మీద అభిమానంతోనే పక్క హీరో సినిమాని కావాలని చెడగొట్టాడనే ఆరోపణలు చేసేవారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి వారి చిత్రాల విషయంలో కూడా ఇలానే జరిగిన సందర్భాలు ఉన్నాయి.
దాసరి, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు నుంచి వైవిఎస్ చౌదరి వరకు ఇలాంటి విమర్శలను ఎదుర్కొక తప్పలేదు. తాజాగా వినయ విధేయ రామ విషయంలో కూడా మెగాభిమానులు అలాగే ప్రవర్తిస్తున్నారు. అందరు హీరోలతో మరీ ముఖ్యంగా బాలకృష్ణతో సింహా, లెజెండ్ వంటి చిత్రాలను తీసి విజయబావుటా ఎగురవేసిన బోయపాటి బాలయ్యతో వైరం కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రం కావాలని చెడగొట్టాడని విరుచుకుపడ్డారు.
కానీ బోయపాటి తన కెరీర్‌లో రవితేజ భద్ర, వెంకటేష్ తులసి, మెగా కాంపౌఔండ్‌కే చెందిన అల్లుఅర్జున్‌తో సరైనోడు వంటి హిట్స్ ఇచ్చాడు. కానీ మెగాభిమానులు మాత్రం వినయ విధేయ రామ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న అనంతరం బోయపాటి బాలకృష్ణకి వీరాభిమాని అని, అందుకే సంక్రాంతి రేసులో కథానాయకుడు ని హిట్‌గా నిలబెట్టేందుకే వినయ విధేయ రామ చిత్రాన్ని చెత్తగా తీశాడని విమర్శలు సంధిస్తున్నారు. కానీ ఏ దర్శకుడు కూడా కావాలని తన కెరీర్‌లో చెరిగిపోని మచ్చను మిగుల్చుకోడు కదా.. అనే లాజిక్‌ని విస్మరిస్తున్న్నారు.