మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినా కూడా బానిస భావజాలం మాత్రం పోవడం లేదు. చిత్ర విచిత్రమైన నిబంధనలు మన దేశంలో ఉన్నాయి. ఇక విషయానికి వస్తే మన దేశంలో నిర్మితమైన మన భాషా చిత్రాలకు జాతీయ అవార్డుల రేసులో నిలిచే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. కానీ ఏదో ఆస్కార్ అవార్డులలో ఉన్నటు వంటి నిబంధనను ఇప్పటికీ మన ప్రభుత్వాలు భుజాలపై మోస్తున్నాయి. ఆస్కార్ అవార్డులలో కూడా కేవలం అమెరికన్ నిర్మాణసంస్థలు నిర్మించిన చిత్రాలు మాత్రమే అర్హత పొందుతాయి.
కాకపోతే ఉత్తమ విదేశీ చిత్రం విషయంలో మాత్రం కాస్త మినహాయింపు ఉంది. ఇక విషయానికి వస్తే అందరు కొత్తవారితో గత ఏడాది విడుదలైన అత్యద్భుత చిత్రం కేరాఫ్ కంచరపాళెం. దీనిని ఇండియాకే చెందిన పరుచూరి ప్రవీణ నిర్మించింది. కానీ ఈమె ఎంతో కాలం కిందట అమెరికాలో స్ధిరపడిన ఎన్నారై. దాంతో ఈ చిత్రానికి జాతీయ అవార్డుల కోసం పంపే అర్హత లేవని కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాత పరుచూరి ప్రవీణ కూడా సోషల్‌మీడియా ద్వారా బాగా ప్రచారం చేసింది.
దాంతో చాలా మంది ఆమెకి మద్దతుగా నిలిచారు. చివరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయం తెలిసి మంచి చొరవ తీసుకున్నాడు. ఆయన కేంద్రమంత్రులైన రాజ్యవర్ధన్‌సింగ్‌రాథోడ్, అరుణ్‌జైట్లీ వరకు ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి కేరాఫ్ కంచరపాళెంకి మద్దతు ప్రకటించాడు. దాంతో కేంద్రం దిగి వచ్చి జాతీయ అవార్డులకు ఈ చిత్రాన్ని పంపే అర్హత ఇచ్చామని చెప్పి మనసు మార్చుకున్నారు. దీంతో పరుచూరి ప్రవీణ ఈ మూవీని జాతీయ అవార్డులకు పంపింది. దీనికి జాతీయ అవార్డులలో ఏదోఒక మంచి అవార్డు రావడం ఖాయమని చెప్పాలి.
ఇదే సమయంలో ఈమె అమెరికా బేస్‌డ్ ఎన్నారై కావడంతో దీనిని ఆస్కార్ నామినేషన్లకు కూడా పంపి, తెలుగు సినిమా సత్తాని అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా నిలుపుతుందని ఆశిద్దాం. ఇలాంటి పనికి మాలిన నిబంధనలను ఇకనైనా తొలగించాలని కోరుకుందాం.