తమిళంలోనే కాదు..ఏకంగా దక్షిణాదిలో... ఇంకా చెప్పాలంటే ఇండియన్ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ తలైవా రజనీకాంత్. గత మూడు దశాబ్దాలకు పైగా కోలీవుడ్‌ని ఈయన మకుటం లేని మహారాజులా శాసిస్తున్నాడు. తమిళనాట కమల్‌హాసన్ ఉన్నా కూడా ఆయన రజనీలా పూర్తి స్థాయి మాస్ హీరో కాదు. కమల్‌హాసన్, విక్రమ్, సూర్య వంటి వారిది ప్రత్యేకశైలి. కానీ మాస్ ఇమేజ్‌లో మాత్రం అక్కడ రజనీకి తిరుగులేదు. అయితే రజనీ తర్వాత ఎవరు అని ప్రశ్నిస్తే మాత్రం అజిత్, విజయ్‌ల పేర్లు బాగా వినిపిస్తాయి.
కానీ తలైవాకి ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా తెలుగు వంటి భాషల్లో కూడా తమిళానికి సరిసమానమైన ఇమేజ్ ఉంది. రజనీ చిత్రాల విడుదల సమయంలో కాకుండా విడిగా అజిత్, విజయ్‌ల చిత్రాలు విడుదలై రజనీ మూవీస్ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించి ఉండవచ్చు. కానీ రజనీతో ఒకేసారి పోటీ పడితే మాత్రం పైచేయి రజనీదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీ నటించిన ఫ్లాప్ చిత్రాలు కూడా జయాపజయాలకు అతీతంగా భారీ కలెక్షన్లు సాధించేవి. కానీ కొంత కాలంగా రజనీ ప్రభ కోలీవుడ్‌లో తగ్గుతోందా? అంటే అవుననేది నిష్టూరసత్యమే.
ఇక ఈ సంక్రాంతికి ఒకే రోజున అంటే 10న రజనీ నటించిన పేటా, అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలు విడుదలయ్యాయి. పూర్తి మాస్ ఓరియంటెడ్‌గా వచ్చిన ఈ రెండు చిత్రాలకు పాజిటివ్ టాకే వచ్చింది. అయితే రజనీకి ఇతర భాషల్లో ఉన్న క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌గా చూసుకుంటే పేట కే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నా, కేవలం తమిళనాట తీసుకుంటే మాత్రం పేట కంటే విశ్వాసం చిత్రం ముందంజలో ఉంది. మరి ఇది రజనీకి మరింత జాగ్రత్తగా చిత్రాలు చేయాలనే ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కనీసం పూర్తిగా రజనీ రాజకీయాలలోకి వెళ్లే వరకైనా తిరుగేలేని సూపర్‌స్టార్‌గా నిలలి, పరువు నిలబెట్టుకోవాలంటే మాత్రం కేవలం స్టైల్ మీదనే ఆధారపడకుండా కథ, కథనాలు, దర్శకుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.