తెలుగులో ఊరమాస్ చిత్రాలు చేసే వారిలో బి.గోపాల్, వినాయక్‌ల పేర్లు ముందుగా చెప్పాలి, మాస్, యాక్షన్, అతిశయోక్తులతో కూడిన హీరోయిజం వంటివి వారి ఆయుధాలు, కానీ వాటికి ప్రస్తుతం కాలం చెల్లింది. అందుకే బి.గోపాల్ గోపీచంద్‌తో తీసిన ఆరడుగుల బుల్లెట్ విడుదలకు కూడా నోచుకోలేదు. దాంతో దాదాపు ఆయన కెరీర్ క్లోజ్ అయినట్లే భావించాలి. ఇక వినాయక్ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. అఖిల్, ఇంటెలిజెంట్ వంటి చిత్రాలు ఆయన పరువును తీశాయి.
బాలయ్యతో సినిమా అన్నారు గానీ అది పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను వంతు వచ్చింది. యాక్షన్, మాస్ ఇమేజ్ కోరుకునే ఆ హీరో అయినా బోయపాటితో ఓ చిత్రం చేయాలని భావిస్తాడు. కానీ ఇది గతం. అందుకే ఇప్పుడిప్పుడు హీరోగా స్థిరపడాలని భావిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్‌లు ఎవ్వరూ ఇవ్వనంత పారితోషికం, బడ్జెట్‌ని కేటాయించి బోయపాటితో జయ జానకి నాయకా చిత్రం చేశారు. ఈయన తీసిన ఓవర్ యాక్షన్ చిత్రం వినయ విధేయ రామ కి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇందులోని అసహజత్వం కలిగిన యాక్షన్ సీన్స్‌ని చూసి మెగాభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.
కథపై దృష్టి పెట్టకుండా, హీరో పాత్రకి సరైన నటనకు స్కోప్ ఇవ్వకుండా, కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే స్క్రీన్‌ప్లేతో ఏవో కత్తులతో నరకడం, ఐదారు పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని పెట్టి అదే యాక్షన్ చిత్రం అని రామ్‌చరణ్ వంటి స్టార్ ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని ఆయన చెడగొట్టుకున్నాడు. వినయ విధేయ రామ విషయంలో రామ్‌చరణ్, చిరంజీవిలు తొందరపడ్డారనే చెప్పాలి. వారు బోయపాటితో ఉన్న నమ్మకంతో పప్పులో కాలేశారు. ఈ చిత్రం చరణ్ కెరీర్‌కి ఉపయోగపడే చిత్రం కాకపోగా, దృవ, రంగస్థలం తర్వాత చరణ్ పేరును చెడగొట్టే చిత్రంగా ఉంది. ఇక తాజాగా బోయపాటి మాట్లాడుతూ, చిరంజీవిగారితో ఓ చిత్రం చేయనున్నాడు.
బాలయ్యతో ఓ మూవీ త్వరలోనే మొదలవుతుంది. మహేష్ బాబుతో కూడా సినిమా చేస్తాను. మహేష్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు నేను రెడీ. అఖిల్‌తో కూడా సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. సరైనోడు, జయజానకి నాయకా, తాజాగా వినయ విధేయ రామ ల ముందు, తర్వాత కూడా ఆయన ఈ నలుగురి పేర్లు చెబుతూనే ఉన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చెప్పిన వారితో చిత్రాలు ఓకే కావాలంటే బోయపాటి తనని తాను మరోసారి నిరూపించుకోవాల్సిన విషమ పరిస్థితి ఉందనే చెప్పాలి.