సంక్రాంతి పండుగకు రావాల్సిన చిత్రాన్ని వచ్చేశాయి. కొత్తదనం, ఏదో ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలని భావించే ప్రేక్షకులకు ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్‌గా వచ్చిన కథానాయకుడు మంచి ఛాయిస్ అనిపించుకుంది. అయితే కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలోని ఎమోషన్స్‌ని చూపించడంలో విఫలం కావడం, కథలో ప్రేక్షకులకు తెలియని ఎన్టీఆర్ జీవితంలోని కోణాలను చూపించకపోవడం, సినిమా అంతా పాజిటివ్‌గానేఉండాలి... ఎవరిని నెగటివ్‌గా చూపించరావు..
ఈ చిత్రం చూసిన వారు ఎన్టీఆర్‌ని పాజిటివ్ వ్యూలో చూసిన ఫీల్‌తోనే థియేటర్ల బయటకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ జీవితంలోని ఎన్నో కీలక ఘట్టాలను వదిలేయడం వల్ల ఎమోషన్స్ మిస్ అయ్యాయి. సినిమా సాగతీతగా, ఏదో రీమిక్స్ సాంగ్స్‌ని చూసిన ఫీల్‌ని కలిగించింది. ఇక వినయ విధేయ రామ, పేట చిత్రాలు పూర్తి మాస్ మసాలా, యాక్షన్ తరహాలో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. చివరగా వచ్చిన దిల్‌రాజు-అనిల్‌రావిపూడి-వెంకటేష్-వరుణ్‌తేజ్‌ల ఎఫ్2 చిత్రం సంక్రాంతి పండుగకు ఫ్యామిలీ ప్రేక్షకులు చూడాలని ఇష్టపడే కామెడీ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది.
ఇది దిల్‌రాజుకి ఎంతో ఊరడింపు అనే చెప్పాలి. గత కొంతకాలంగా దిల్‌రాజు పరిస్థితి బాగా లేదు. ఏదీ కలిసి రావడం లేదు. అయినా ఆయనకు సంక్రాంతి మాత్రం బాగానే అచ్చివచ్చింది. సీతమ్మ వాకిట్లోసిరిమల్లెచెట్టు, శతమానం భవతి వంటి చిత్రాలతో ఆయన సంక్రాంతికి కొన్ని సెలైంట్ కిల్లర్స్‌ని అందించాడు. ఈ ఏడాది కూడా ఎఫ్2తో ఆయన అదే పనిచేశాడు. ఇక ఈ చిత్రాన్ని మొత్తం వెంకీ తన నటనతో వన్‌మ్యాన్‌షో అనిపించి, నడిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ చూస్తేఎప్పుడో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు మరలా మన కళ్ల ముందు మెదులాడుతాయి. దాంతో మనకి చాలా కాలం తర్వాత పాత వెంకీ కనిపించాడు.
అన్నపూర్ణ, వై.విజయ, వరుణ్‌తేజ్, మెహ్రీన్ వంటి సీనియర్, యంగ్ ఆర్టిస్టులను ఆయన డామినేట్ చేశాడు. కంటెంట్ పెద్దగా లేకపోయినా హాస్య సన్నివేశాలు, సంభాషణలతో చిత్రాన్ని రక్తి కట్టించాడు. ఇక సెకండ్ హాఫ్‌పై మాత్రం కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. గంటకు పైగా ప్రకాష్‌రాజ్ ఇంట్లోనే కథను నడపడం వల్ల సాగతీత అనిపించింది. కుక్కను లోబరుచుకునే సీన్‌లో తోడల్లుడు వరుణ్‌తేజ్ భవిష్యత్తుని ఊహించుకోవడం, వరుణ్‌ని హెచ్చరించడం, లేట్ వయసులో పెళ్లి కాని ప్రసాద్ తరహా పాత్రలో ఆయన నటన బాగా మెప్పించింది.
ఇక అనిల్‌రావిపూడి పూర్తి స్క్రిప్ట్‌తో సినిమా షూటింగ్ చేయలేదని వచ్చిన వార్తలకు వెంకీ కూడా అది నిజమేననే విధానంలో సమాధానం చెప్పడం చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. అనిల్‌రావిపూడి, దిల్‌రాజు వంటి వారు కూడా పూర్తి స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి ఎంటర్ కాకపోవడం మాత్రం సరైన పద్దతి కాదనే చెప్పాలి. మొత్తానికి ఈ సంక్రాంతికి కథానాయకుడు, ఎఫ్2లలో ఏది విజేతగా నిలుస్తుందో వేచిచూడాల్సివుంది...!