దేనికైనా హద్దు ఉండాలి. అంతేగానీ నేను కేవలం హైఓల్టేజ్ యాక్షన్ చిత్రాలే తీస్తాను.. ప్రేక్షకులు నా నుంచి కోరుకునేవి అవే అయినప్పుడు నేనే వేరే ఫార్ములా చిత్రాలు ఎందుకు తీయాలి? భవిష్యత్తులో ఏదైనా బయోపిక్ తీయాల్సి వచ్చినా కూడా నా మార్క్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇటీవల బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు. జయ జానకి నాయకా సమయంలో కూడా పోటీగా నేనే రాజు నేనేమంత్రి, లై చిత్రాలు ఉన్నప్పటికీ నా సినిమాకి ఏదీ పోటీ కాదు. నా చిత్రాలను ఎవరు ఆదరిస్తారో నాకు తెలుసు.
ఈ చిత్రం 40కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఢంబాలు పలికాడు బోయపాటి. అయితే సింహా, లెజెండ్ వంటి చిత్రాలు వచ్చినప్పటి పరిస్థితి వేరు. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. యాక్షన్‌ని కూడా డిఫరెంట్‌గా, లాజిక్‌గా, మైండ్ గేమ్‌లా చూపించే విధానమే ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ విషయంలో బోయపాటి ట్రెండ్‌కి తగ్గట్లు మారలేదని వినయ విధేయ రామ చూస్తే అర్ధమవుతుంది. గతంలో బి.గోపాల్ బాలయ్యతో చేసిన కొన్ని చిత్రాలు, ఇతర దర్శకులు బాలయ్యతో చేసిన మూవీస్‌లో ఎన్నో అతిశయోక్తులు ఉండేవి.
కంటి చూపుకి రైళ్లు ఆగిపోవడం, కుర్చీలు కదిలి రావడం, పర్వతాన్ని వీరోచితంగా ఎక్కి కుందేలు పిల్లని కాపాడటం, కాలికి ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని ప్యారాచూట్‌లో ఎగరడం వంటివి చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో. దాంతోనే బి.గోపాల్ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత వినాయక్ కూడా అఖిల్ వంటి చిత్రాలలో ఇదే చేసి దెబ్బతిన్నాడు. తాజాగా వినయ విధేయ రామ తో బోయపాటి వంతు వచ్చింది. అసలు ఈ చిత్రంలో ఎయిర్‌పోర్ట్ అద్దాలు పగులగొట్టుకుని రావడం, ట్రైన్ మీదకి దూకడం, బీహార్ వెళ్లడం, కత్తితో ఇద్దరి తలలు తెగనరికితే గద్దలు వచ్చి ఎత్తుకొని పోవడం.. ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
దృవ, రంగస్ధలం చిత్రాల తర్వాత రామ్‌చరణ్ చేయాల్సిన చిత్రం కాదు ఇది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దృవ, రంగస్థలం లో మాస్, యాక్షన్ ఉన్నప్పటికీ వాటిని ఎంతో కొత్తదనంతో చూపించారు. కానీ ఈ సారి మాత్రం మరో బ్రూస్‌లీ ని మరిపించారు. ఇక ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటించేందుకు ఒప్పుకోలేదట. కానీ బోయపాటి ఆ పాత్రను గురించి చెప్పిన తర్వాత వెంటనే ఒప్పుకున్నాడని, ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ కూడా ముట్టజెప్పారని తెలుస్తోంది. బోయపాటి చిత్రాలలో విలన్లు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు.
కానీ ఇందులో వివేక్ ఒబేరాయ్‌ని ఉపయోగించుకోవడంలో బోయపాటి విఫలం అయ్యాడు. మొత్తానికి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో.. వినయ విధేయ రామ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడానికి ఇంకా ఎక్కువ కారణాలే ఉన్నాయని చెప్పవచ్చు.