నాడు ఎన్టీఆర్ కెరీర్‌ని ప్రారంభం నుంచి చూసిన వారు మరీ ఎక్కువగా లేకపోయినా కొందరు ఉన్నారు. కానీ వారి సలహాలను ‘కథానాయకుడు’టీం తీసుకోలేదా? అనే అనుమానం వస్తోంది. బయోపిక్ అంటే అందులో రెండు కోణాలు ఉండాలి. కానీ అంతా మంచే చూపిస్తాం. చెడుగా చూపించాల్సినవి అసలు చూపించం.. ఎవ్వరినీ చెడ్డగా చూపే ఉద్దేశ్యం లేదు అంటే దానికి బయోపిక్ అని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత ఏయే సంఘటనలు, పరిణామాలు జరిగాయి? అనే కోణంలో తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని తీస్తున్నానని వర్మ చెప్పాడు. బహుశా ఆయన లక్ష్మీపార్వతి మంచిగా చూపిస్తూ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను, చంద్రబాబు నాయుడుని నెగటివ్‌గా చూపించే అవకాశం ఉంది. అదే సమయంలో అసలు చూపించం అని కాకుండా బాలయ్య, చంద్రబాబుల కోణంలోనైనా నిజమని వారికి అనిపించిన వాస్తవాలను చూపిస్తే క్రిష్ సక్సెస్ అయ్యేవాడు.
మరోవైపు ఈ చిత్రం సాగతీతగా అనిపించిందని, రెండు పార్ట్‌లను ఒకే మూవీలో చూపించి రేసీగా స్క్రీన్‌ప్లే నడిపించి ఉంటే బాగుండేదని కూడా వాదన వినిపిస్తోంది. తేజ ఈ అనవసర గెటప్పులు, పాటల బిట్స్ వల్లనే సినిమాని వదిలేశాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే తేజ అనుకున్నదే నేడు వాస్తవంలో నిజంగా మారింది. ఈ గెటప్‌లు, పాత పాటల కోసం ఎవ్వరూ సినిమా చూడరనే పాయింట్‌ని యూనిట్ మరిచింది. ఇక ఎన్టీఆర్ బాల్యం, పడిన కష్టాలు, నాటకాలలో ఆయనకున్న అనుభవం సినిమాకి ఎలా ఉపయోగపడింది? ‘పాతాళభైరవి’ ముందు ఇంటి నుంచి తెచ్చిన డబ్బులు అయిపోతే మరలా ఇంట్లో వారిని డబ్బులు అడగకూడదని భావించి ఎన్టీఆర్ పస్తులు ఉన్న దినాలు, నాటి ఫ్లాప్‌లు, స్టార్‌గా ఎదగడానికి ఆయన పడిన కష్టాలు, చంద్రబాబుతో పరిచయం, తన అల్లుడిని చేసుకున్న విధానం, మద్రాస్ నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్‌కి తీసుకొచ్చిన ఘటన, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీకి ఎన్నో చేస్తానని చెప్పి ఏమీ చేయలేదని ఆయన మీద వ్యంగ్యంగా పలువురు మరీ ముఖ్యంగా కృష్ణ తీసిన చిత్రాలు, అందులో తన పాత్రలో నటించిన కోటశ్రీనివాసరావుని ఎన్టీఆర్ అభినందించడం, తన ప్రతి స్క్రిప్ట్ ఎంతో మంచి క్రిటిక్‌గా ఎన్టీఆర్ భావించి తన భార్య బసవతారకంకు వినిపించిన విషయం... వంటి పలు అంశాలు ఇందులో లేవు.
వీటిని తాజాగా ఎన్టీఆర్ సమకాలీనుడైన ఫిల్మ్‌జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి బయటపెట్టాడు. ఇక ‘దానవీరశూరకర్ణ’లో ఎక్కువ పాత్రలను పోషించిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నట్లు చూపారు. కానీ అంతకు ముందే ఏయన్నార్ ‘నవరాత్రి’ చిత్రంలో ఏకంగా 9 పాత్రలు పోషించాడు. అంజలి, భానుమతి, ‘గుండమ్మకథ’ సమయంలో సూర్యకాంతం వంటి వారి ప్రస్తావన లేకపోవడం... ఇలా ఎన్నో విషయాలను విస్మరించడం వల్ల ‘కథానాయకుడు’ పూర్తి విందు వంటి చిత్రాన్ని అందించలేకపోయిందనేది వాస్తవం.