స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా ఆయన ముద్దుల తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తూ, స్వయంగా నిర్మాణంలో మొదటిసారిగా భాగస్వామిగా మారి చేసిన చిత్రం ‘కథానాయకుడు’ తాజాగా విడుదలైంది. బహుశా ఓ తండ్రి పాత్రలో తనయుడు నటించడం అనేది ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి కాబోలు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని, బాలయ్య కెరీర్‌లోనే ఇది మరపురాని చిత్రమని, కలెక్షన్లపరంగా కూడా ఇది బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేయడం గ్యారంటీ అని నందమూరి అభిమానులు అంటున్నారు.
ఇక ఇందులో అనేక రకాల పాత్రలు, గెటప్‌లు, మేకప్‌లతో బాలయ్య పడిన కష్టం కళ్లకు కట్టినట్లుగా అర్ధమవుతుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన బాలయ్యతో పాటు నాడు ఎన్టీఆర్‌కి సుపరిచితులైన పలు పాత్రలను ఎందరో ముఖ్య నటీనటులు పోషించినప్పటికీ అందరి కంటే ఎక్కువగా ఆకట్టుకుంది మాత్రం ఎన్టీఆర్ భార్యగా, బాలయ్య తల్లిగా నటించిన బసవతారకం పాత్ర.
ఈ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒదిగిపోయింది. తొలి తెలుగు చిత్రమే అయినా ఆ ఫీలింగ్‌ని ప్రేక్షకులలో కనిపించకుండా నటించి మెప్పించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పెద్దకుమారుడు మరణించినప్పుడు ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా పలికాయి. బసవతారకం జీవితాంతం గృహిణిగానే ఉంటూ లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేసింది. ఆమె రూపురేఖలు, ఆమె వ్యక్తిత్వం, ఆమె జీవితం పెద్దగా ఎవ్వరికీ తెలియదు.
కానీ రాబోయే రోజుల్లో బసవతారకం పేరు వస్తే మన కళ్లముందు విద్యాబాలనే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ‘కథానాయకుడు’ ఎన్టీఆర్‌కి సంబంధించిన సన్నివేశాలన్ని చూపించారు. కానీ ఇవ్వన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఏదో వచ్చాయి... పోయాయి అన్నట్లుగా బిట్లు బిట్లుగానే ఉండటం వల్ల అసలైన ఎమోషన్స్ మిస్ అయ్యాయి. బహుశా ఈ కారణం వల్లనే తేజ ఈ మూవీ నుంచి అర్ధాంతరంగా తప్పుకుని ఉంటాడు.
క్రిష్ కూడా ఎమోషన్‌ని సినిమా మొత్తం క్యారీ చేయడంలో పెద్దగా విజయం సాధించలేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ ‘కథానాయకుడు’కంటే నాగ్‌అశ్విన్ తీసిన ‘మహానటి’కే ఎక్కువ మార్కులు పడతాయి. ‘మహానటి’ విషయంలో నాగ్ అశ్విన్ చేసిన కృషి ‘కథానాయకుడు’లో క్రిష్ చేయలేదేమో అనే అనుమానం రాకమానదు. మరి ఈ లోపాలన్నింటినీ ‘మహానాయకుడు’తో అధిగమిస్తారేమో వేచిచూడాల్సివుంది...!