తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌గా బాలయ్య నటించి, నిర్మిస్తున్న మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ విడుదలైంది. రెండో భాగంగా రానున్న ‘మహానాయకుడు’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’కి బాగుందని టాక్ వచ్చినా మరో పదేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేసి ఉంటే బాగుండేదని, లేదా ‘కథానాయకుడు’లోనే ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలోని యంగ్ పాత్రను ఎన్టీఆర్ చేత చేయించి, వయసు మీద పడిన పాత్రను బాలయ్య చేసి ఉంటే బాగుండేదని విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలి పార్ట్ ‘కథానాయకుడు’ విడుదలైన సందర్భంగా ఈ చిత్రం గురించి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కీలకవ్యాఖ్యలు చేసింది.
ఈ బయోపిక్ పూర్తిగా చంద్రబాబు కన్నుసన్నలలో, ఆయన డైరెక్షన్‌లో రూపొందింది. బాలయ్య మంచి వ్యక్తి. కానీ ఆయన చంద్రబాబుకి భయపడి ఇందులో అవాస్తవాలను చూపించారు. బాలయ్య భయస్తుడు కావడం వల్లే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని వాస్తవాలను చూపించే ధైర్యం కేవలం రాంగోపాల్‌వర్మకే ఉంది. తాజాగా వర్మ విడుదల చేసిన ‘ఎందుకు’ పాట విన్న తర్వాత వర్మపై మరింత నమ్మకం ఏర్పడింది. ఇందులో అసలైన వాస్తవాలను చూపిస్తారనే నమ్మకం పెరిగింది. ఎన్టీఆర్స్ బాలయ్య బయోపిక్ రెండు పార్ట్‌లలో చూపించేవి కేవలం అవాస్తవాలే. ఈ బయోపిక్‌పై ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు నమ్మకం లేదు. వారంతా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ‘ఎందుకు’ పాట విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. పాట మొదట నన్ను కాస్త బాధించింది. పాట వింటున్న సమయంలో నన్ను విమర్శించినట్లు అనిపించినా, చివరకు అవన్నీ ప్రశంసలేనని వర్మ అన్నారు. ఈ పాట విన్న తర్వాత వర్మపై నాకు మరింత గౌరవం ఏర్పడింది. ఎన్టీఆర్ గురించి నిజాలు చెప్పే సత్తా వర్మకి మాత్రమే ఉన్నాయనే నమ్మకం కలిగింది. ఎన్టీఆర్ బయోపిక్ సంపూర్ణం కాదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలైతేనే అది పూర్తి బయోపిక్ అవుతుంది.
కేవలం సినిమాలలో హీరోగా ఎలా అయ్యాడు? డ్యాన్స్‌లు ఎలా చేశాడో చూపించడమే బయోపిక్ అనిపించుకోదు. సినిమాలలో ప్రయత్నాలు చేస్తూ పడిన కష్టాలు... ఆ తర్వాత రాజకీయంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, చివరి రోజుల్లో పడిన ఆవేదన వంటివి చూపిస్తేనే అది నిజమైన బయోపిక్ అవుతుందని లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు నిజమేననిపించకమానదు.