జనాల నాడిని పట్టడం పుట్టించిన ఆ దేవుడి తరం కూడా కాదు. ముఖ్యంగా సినీ స్టార్స్ వీరాభిమానులు తమ అభిమాన హీరోల నుంచి ఏమాత్రం చిన్న సంకేతం వచ్చినా దానిని ఆచరించాలని చూస్తారు. ఇక విషయానికి వస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏపీలో చంద్రబాబుకి మంచి సంకేతాలే అందుతున్నాయి. మరోసారి తెలుగుదేశంతో జనసేన పొత్తు ఉండవచ్చనే చర్చ సాగుతున్న నేపధ్యంలో ఇది అత్యంత కీలకం కానుంది. పవన్ టిడిపిని దుయ్యబట్టే సమయంలో జగన్ నోరు జారి పవన్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయడం వికటించింది. శత్రువుకు, శత్రువు మిత్రుడవుతాడనే సూత్రాన్ని అతి నమ్మకం కారణంగా జగన్ విస్మరించాడు.
కిందటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిని అవుతాననే అతి విశ్వాసమే ఆయన కొంప ముంచింది. ఎంవీ మైసురారెడ్డి, కొణతాల రామకృష్ణ, భూమా, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి, సబ్బం హరి వంటి నమ్మకస్తులను ఆయన దూరం చేసుకుంటూ వస్తున్నాడు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఈ సూత్రం జగన్‌కి అర్ధం కావడం లేదు. ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలనే డిక్టేటర్ స్వభావం మానుకుని పట్టు విడుపులు ప్రదర్శిస్తేనే రాజకీయ చాణక్యం అనిపించుకుంటుంది. ఈ విషయంలో జగన్ మరోసారి తప్పు చేశాడు.
రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉండే వారిని సంతృప్తిపరిచి దానిని క్యాష్ చేసుకోలేకపోవడం మైనస్ అవుతోంది. ఈ విషయంలో చంద్రబాబు శైలి ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్త పనికి వస్తాడని భావిస్తే వారిని స్వయంగా కలిసి, కావాలంటే వారి నివాసాలకు వెళ్లి కూడా మచ్చిక చేసుకోవడం ఆయన నైజం. కిందటి ఎన్నికల్లో పవన్‌ని అలానే మంచి చేసుకున్నాడు.
ఇక సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్‌బాబు బావ గల్లా జయదేవ్‌కి ఎంపీ సీటు ఇచ్చాడు. ఇక తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొకరి మద్దతు జగన్ పొగొట్టుకున్నాడు. కృష్ణ సోదరుడు, మహేష్ బాబాయ్ అయిన నిర్మాత ఆదిశేషగిరిరావు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఘట్టమనేని అభిమానులను వైసీపీకి మద్దతు ఇవ్వమని కోరినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశాడు.
ఈయన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించాడు. కానీ జగన్ మాత్రం విజయవాడ పార్లమెంట్ సీటు నుంచి ఎంపీగా పోటీ చేయమని ఆదేశించడంతో మనస్థాపం చెందిన ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేసి త్వరలో ఘట్టమనేని అభిమానుల సమక్షంలో టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
ఒక వైపు బావ, మరోవైపు బాబాయ్‌లు టిడిపిలో ఉంటే పవన్‌తో సమానంగా ఫ్యాన్స్ ఉన్న మహేష్‌బాబు అభిమానులు, మరోవైపు ఎలాగూ బాలకృష్ణ అభిమానులు, ఇలా దాదాపు సినీ పరిశ్రమలోని పెద్ద ఫ్యామిలీల మద్దతు టిడిపికే లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.