హారర్ ఎంటర్‌టైనర్‌ల ట్రెండు మొదలైన దగ్గరి నుంచి ఆ తరహా సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాలని నమ్ముకున్న వాళ్లు భారీగానే మూటగట్టుకున్నారు. ఆ జాబితాలో రాఘవ లారెన్స్ ముందు వరుసలో వుంటారు. `ముని` వంటి హారర్ థ్రిల్లర్‌తో మొదలైన ఆయన ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. 2007లో వచ్చిన ఈ చిత్రం దర్శకుడిగా, నటుడిగా రాఘవ లారెన్స్ కెరీర్‌ను మలుపు తిప్పింది. థ్రిల్లర్ చిత్రాల శైలిని, ఆ తరహా చిత్రాల పట్ల ప్రేక్షకుడి నాడిని పట్టుకున్న లారెన్స్ అక్కడి నుంచి అదే తరహా చిత్రాలతో విజయాలు సాధిస్తూ వస్తున్నారు.
దెయ్యం కాన్సెప్ట్‌కు దూరంగా `మాస్` మినహా రాఘవ లారెన్స్ చేసిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దాంతో హారర్ సినిమాలపైనే ఎక్కువ మక్కువ పెంచుకున్న లారెన్స్ ఆ తరహా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. `ముని` తరువాత దానికి సీక్వెల్స్‌గా చేసిన ముని-2 కాంచన, ముని 3 గంగ ప్రతికూల వాతావరణంలో వచ్చినా తెలుగు, తమిళ భాషల్లో కలెక్షన్‌ల వర్షం కురిపించాయి. దీంతో మరో జోనర్ సినిమాల వైపు అడుగులు వేయని లారెన్స్ `ముని` సిరీస్‌లపైనే ఆశలు పెట్టుకుంటున్నాడు.
తాజాగా ముని సిరీస్ నుంచి నాలుగవ ఇన్‌స్టాల్‌మెంట్‌ని వదలడానికి సిద్ధమవుతున్నాడు. తమిళంలో `ముని- 4: కాంచన-3` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేయబోతున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఓవియా, వేదిక, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో లారెన్స్ ఓల్డ్ గెటప్‌లో కనిపించడం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కూడా తెలుగులో వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం అని, లారెన్స్ దెయ్యం పేరు చెప్పి హ్యాపీగా బ్రతికేస్తున్నాడని టాలీవుడ్ జనాలు చెప్పుకోవడం కొసమెరుపు.