నిన్నటితరం బిజీ విలన్ వివేక్ ఒబేరాయ్, సందీప్‌సింగ్‌లు నిర్మాణ భాగస్వాములుగా రూపొందతున్న నరేంద్రమోదీ బయోపిక్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ని తాజాగా ఈ చిత్రం యూనిట్ విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా బయోపిక్‌ల హవా రాజ్యమేలుతున్న సమయంలో ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ ఏకంగా 23 భాషల్లో విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తెలిపారు.
గత కొంతకాలంగా మోదీ బయోపిక్ రూపొందుతోందని, ఇందులో వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను పోషిస్తాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలే నిజమయ్యాయి. ఒమాంగ్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక పోస్టర్‌లో వివేక్ ఒబేరాయ్ అచ్చు మోదీని అచ్చుగుద్దినట్లు మోదీ వేసుకునే దుస్తులతో, ఆయన సిగ్నేచర్ గడ్డంతో కనిపిస్తూ ఉండటంతో దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
వాస్తవానికి దేశానికి ప్రధానులుగా పనిచేసిన ఇద్దరైన ‘మన్మోహన్‌సింగ్, నరేంద్రమోదీ’లకు సంబంధించిన బయోపిక్స్ రూపొందుతూ ఉండటంతో ఈ రెండింటిలో ఏది వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది? ఏది ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది? అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. మన్మోహన్‌సింగ్ బయోపిక్‌గా రూపొందుతున్న ‘యాక్సిడెంటల్ పీఎం’లో కూడా దేశం గర్వించదగ్గ నటుడు అనుపమ్‌ఖేర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన లుక్‌కి కూడా మంచి స్పందనే లభిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో యూపీఏ-ఎన్డీయే కూటముల మధ్య భీకరయుద్దం జరగనున్న నేపధ్యంలో సినిమా పరంగానే కాదు.. ఎన్నికల్లో కూడా ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ ఇద్దరి బయోపిక్‌లలోనూ వారి బాల్యం, విద్యా, రాజకీయ ప్రస్థానం నుంచి దేశానికి ప్రధానులుగా ఎదిగిన తీరుని చూపించనున్నారు.