తన తండ్రి అల్లు అరవింద్, తాత అల్లు రామలింగయ్య కూడా నిర్మాతలే కదా.. ఇప్పుడు అల్లు అర్జున్ నిర్మాతగా మారడంలో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడ అల్లు అర్జున్ నిర్మాతగా మారానుండడం నిజమే కానీ.. ఆయన తన తాత, తండ్రి బాటలో సినిమాల నిర్మాణంలోకి కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ఆదర్శంగా తీసుకొని బుల్లితెర నిర్మాణానికి తెరలేపుతున్నాడు. ఆల్రెడీ మాదాపూర్ లో స్వంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్.. గీతా ఆర్ట్స్ సారధ్యంలోనే కొన్ని టీవి షోస్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఈమేరకు ఆల్రెడీ టీవి ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉన్న షో డైరెక్టర్స్ మరియు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ ను కూడా కలిశాడట.
అల్లు అర్జున్ తోపాటు స్నేహారెడ్డి కూడా ఈ టీవి షోస్ ప్రొడక్షన్ లో భాగస్వామ్యం కానుంది. అల్లు అర్జున్ ఆబ్సెన్స్ లో స్నేహా రెడ్డి ఈ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకొనేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే.. ఈ తాజా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏవైనా రియాలిటీ గేమ్ షోస్ వస్తాయా లేక సీరియల్స్ ప్రొడక్షనా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇకపోతే.. అల్లు అర్జున్ ప్రస్తుతం త్వరలో తాను నటించబోయే త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ లో ఉన్నాడు. ఈమధ్యకాలంలో కాస్త విచిత్రమైన స్టైల్స్ ప్రయత్నించి అభిమానులను మెప్పించలేకపోయిన అల్లు అర్జున్.. దేశముదురు టైమ్ లో లుక్ ను రిపీట్ చేస్తున్నాడు. అరవింద సమేత సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న త్రివిక్రమ్.. బన్నీతో తన మూడో చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడట. కాకపోతే.. కథ ఏమిటనేదే ఇప్పటివరకు ఫిక్స్ అవ్వలేదు.