అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సరిగ్గా రెండు రోజుల్లో మన ముందుకురానుంది. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై తెలుగు సినిమా అభిమానులకు చాలా ఆశలున్నాయి. సినిమా ఆ ఆశలను నెరవేర్చగలదా, అంచనాలను అందుకోగలదా అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాలనుకోండి. అయితే.. నిన్నట్నుంచి ఈ సినిమా విషయంలో కొత్త చర్చ మొదలైంది. నిన్నమొన్నటివరకూ కేవలం ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాలను చూపించారా లేక కేవలం పాజిటివ్స్ ను మాత్రమే తెరకెక్కించారా అని సాగిన చర్చ ఇప్పుడు అసలు ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంపైకి మళ్ళింది.
నిజానికి తేజ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం అనంతరం ఆయన తప్పుకోవడంతో క్రిష్ చేతికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. క్రిష్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. దర్శకత్వం మొత్తం బాలయ్యే చేశాడనేది టాక్. బాలయ్య తన తండ్రిలా కనిపించే సన్నివేశాలన్నిటికీ క్రిష్ కేవలం దర్శకత్వ పర్యవేక్షణ చేశాడట. ఆ సన్నివేశాలను బాలయ్య స్వయంగా షూట్ చేసుకొన్నాడట. ఈ విషయాన్ని క్రిష్ పలుమార్లు ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. బాలయ్య అంటే విపరీతమైన అభిమానంతోపాటు, నందమూరి కుటుంబం పట్ల గౌరవం కూడా ఉన్న క్రిష్ మొన్నటివరకూ ఈ విషయమై సైలెంట్ గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు బరస్ట్ అవుతున్నాడో తెలియడం లేదు. అయితే.. ఏవైనా కొన్ని సన్నివేశాలు బాలేవు అని టాక్ వస్తే.. అవి తీసింది బాలయ్యే అని ప్రేక్షకులు, విశ్లేషకులు గ్రహించడం కోసం క్రిష్ తీసుకొన్న ముందు జాగ్రత్త ఇది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి క్రిష్ ముందు జాగ్రత్త సత్ఫలితాన్నిస్తుందో లేదో చూడాలి.