ఇప్పటికే ఒక క్రికెట్ టీం ఆడేందుకు సరిపడమంది హీరోలున్న మెగా క్యాంప్ నుంచి వచ్చిన మరో యువ కథానాయకుడు కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్నల్లుడు కావడంతో మనోడికి హీరోగా ఛాన్స్ వచ్చింది. అయితే.. పరిచయ చిత్రంలో బాబు పెర్ఫార్మెన్స్ ను మెగా అభిమానులు సైతం సహించలేకపోయారు. అందుకే విజేత బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అందుకే ఈసారి కాస్త ఆచితూచి మరీ సెకండ్ సినిమా సైన్ చేశాడు. పులి వాసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మించనున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది.
తొలుత ఈ చిత్రాన్ని సుధీర్ బాబుతో ప్లాన్ చేసినప్పుడు మెహరీన్ ను కథానాయికగా ఎంపిక చేశారు, కానీ సుధీర్ బాబు తప్పుకోవడంతో కళ్యాణ్ దేవ్ సరసన నటించి తన కెరీర్ ను కష్టాల్లో నెట్టుకోవడం ఇష్టం లేని మెహరీన్ కూడా ఆ సినిమా నుంచి తప్పుకొంది. దాంతో స్టోరీ, హీరో, ప్రొడ్యూసర్ రెడీగా ఉండి కూడా సినిమాను మొదలెట్టలేని పరిస్థితి చోటు చేసుకొంది. ఆ తర్వాత చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ పెద్దగా ఉపయోగంలేకపోయింది.
చివరికి ఎంటివి వీజే గా కెరీర్ ను స్టార్ట్ చేసి తూనీగా తూనీగాతో హీరోయిన్ గా మారిన రియా చక్రవర్తిని మెగా అల్లుడి సరసన కథానాయికగా ఫైనల్ చేశారట. తెలుగులో అనుకున్నంతగా వర్కవుట్ అవ్వకపోవడంతో హిందీలోనూ ప్రయత్నించించి.. అక్కడ కూడా అమ్మడికి పెద్దగా పనవ్వలేదు. దాంతో మళ్ళీ టాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది రియా. మరి మెగా అల్లుడు ఆమె కెరీర్ కు ఎంత వరకూ ప్లస్ అవుతాడు అనేది చూడాలి.