మొన్నామధ్యన ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. అయితే ఫిదా సినిమాలో సాయి పల్లవి నటనకు, ఆమె డాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో వరుణ్ మీద సాయి పల్లవి డామినేషన్ అడుగడుగునా కనబడింది. ఫిదా సినిమా క్రెడిట్ మొత్తం సాయి పల్లవికి, దర్శకుడు శేఖర్ ఖమ్ములకే పోయింది. ఇక తొలిప్రేమ సినిమాలో వరుణ్ నటన, లుక్స్ కి మంచి పేరొచ్చినా.. ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం కొత్త దర్శకుడు వెంకీ అట్లూరికే పోయింది. తొలిప్రేమ హిట్ లో మేజర్ క్రెడిట్ వెంకీ అట్లూరి పొందగా.... వరుణ్ తేజ్ కి పర్వాలేదనిపించే మార్కులు పడ్డాయి. ఇక అంతరిక్షం సినిమా బావున్నప్పటికీ.. ఆ సినిమాకి కలెక్షన్స్ సో సో గా రావడం.. సినిమాకి వచ్చిన కాస్తో కూస్తో పేరు దర్శకుడు సంకల్ప్ కి పోవడం జరిగాయి. ఇక తాజాగా వరుణ్ తేజ్, వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ టు అనే మల్టీస్టారర్ లో నటించాడు.
ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న అంటే వచ్చే శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న వరుణ్ కి వెంకీతో కాస్త గండమే ఉంటుంది. ఎందుకంటే వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలతో ప్రస్తుతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. మరి ఎఫ్ టు లో కూడా వెంకటేష్ డామినేషన్ కి ఈ మెగా హీరో వరుణ్ నలిగిపోవడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ నటన ముందు వరుణ్ ఎంతవరకు నిలబడగలడని అంటున్నారు.
మరి దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్ టు సినిమా ఒకవేళ హిట్ అయినా క్రెడిట్ మొత్తం వెంకటేష్ ఖాతాలోకే వెళుతుంది కానీ.... వరుణ్ తేజ్ కి ఎలాంటి పేరు రాదంటున్నారు. మరోపక్క అనిల్ రావిపూడి వెంకీ క్యారెక్టర్ కి రాసినంత కామెడీ వరుణ్ క్యారెక్టర్ కి రాయలేదంటున్నారు. మరి ఎఫ్ టు ఫన్ ఫ్రస్టేషన్ లో వెంకటేష్ తో పూర్తిగా వరుణ్ కామెడీ చేసి మెప్పించాడో లేదో అనేది జనవరి 12 కి తేలిపోతుంది. చూద్దాం ఈ సినిమాతో అయినా వరుణ్ తన క్రేజ్ ని పెంచుకుంటాడో.. లేదో.. అనేది.