తెలుగులో మణిశర్మ, కీరవాణి, కోటిల తర్వాత నెంబర్‌వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎవరైనా ఠక్కున రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ పేరు చెబుతారు. గత దశాబ్దంకు పైగా ఈయన అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా సుకుమార్, దిల్‌రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారి చిత్రాలకు ఆయన ఇచ్చే సంగీతం అద్భుతంగా ఉండేది. ఇక ఈయన చేతిలో ఐటమ్‌నెంబర్స్ పడ్డాయంటే.. ఇంక వాటికి తిరుగులేనట్లే. ఇక ‘అ.. అంటే అమలాపురం’ వంటివి తెలుగు వారినే కాదు.. తెలుగు భాష తెలియని వారిని కూడా ఉర్రూతలూగిస్తాయి. గత ఏడాది ఆయన సంగీతం అందించిన ‘రంగస్ధలం, భరత్ అనే నేను’ చిత్రాల విజయంలో దేవిశ్రీ అందించిన సంగీతం సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడానికి ఎంతగా దోహదపడ్డాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న రామ్‌చరణ్-బోయపాటి శ్రీనుల ‘వినయ విధేయ రామ’, వెంకటేష్-వరుణ్‌తేజ్-దిల్‌రాజు-అనిల్‌రావిపూడిల కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఎఫ్2’ చిత్రాలకు సంగీతం అందించాడు. సహజంగా కొన్ని చిత్రాల మ్యూజికల్ ఆల్బమ్స్ విన్న ఒక్కసారే అద్భుతంగా ఆకట్టుకోలేవు. తినగా తినగా వేప తియ్యనుండు.. అన్న చందంగా వినేకొద్ది మదిలోకి ఎక్కి అలరిస్తాయి. ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్2’ చిత్రాల ఆడియో విడుదలైనప్పుడు కూడా పలువురు సినిమా విడుదల దగ్గర పడే కొద్ది అలరిస్తాయని గట్టిగా నమ్మారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఇప్పటికీ ఈ పాటల్లో ఒకటి కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోలేకపోతోంది. నిజానికి ‘రంగస్థలం, భరత్ అనే నేను’ తర్వాత దేవిశ్రీ అందించిన ఆల్బమ్స్ నాసిరకంగానే ఉన్నాయి. దీంతో మహేష్ అభిమానులు కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.
కారణం ఏమిటంటే.. ఎన్నో అంచనాల మద్య ఏకంగా దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిల వంటి భారీ నిర్మాతల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ ల్యాండ్ మార్క్ చిత్రంగా రూపొందుతున్న ‘మహర్షి’కి దేవిశ్రీనే సంగీతం అందించాడు. ఆయన నుంచి మంచి అవుట్‌పుట్ కోసం ఏకంగా ఆయనను వంశీపైడిపల్లితో పాటు అమెరికా పంపి, అక్కడే ట్యూన్స్‌ని రెడీ చేయించారు. మరి ‘మహర్షి’తోనైనా దేవిశ్రీ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ కొట్టకపోతే మాత్రం ఆయన స్థానానికి ప్రమాదం పొంచి ఉందనేది వాస్తవం.
అయితే కొత్తగా, పరభాషా సంగీత దర్శకులు పెద్దగా రాణించలేకపోతూ ఉండటం, కొత్త సంగీత దర్శకుల్లో టాలెంట్ ఉన్నా కూడా వారికి స్టార్స్ చిత్రాలలో చాన్స్‌లు రాకపోవడం, స్టార్స్, దర్శకనిర్మాతలు భారీ ప్రాజెక్ట్స్ విషయంలో యంగ్ టాలెంటెడ్ సంగీత దర్శకులను నమ్మకపోవడం కూడా దేవిశ్రీకి కాస్త కలిసొచ్చే అంశంగా మారింది. మరలా పాత దేవిశ్రీని చూసేది.. సారీ.. వినేది ఎప్పుడో చూడాలి.