ఓవర్‌సీస్ ప్రేక్షకుల తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఎప్పుడు తమ హీరో చిత్రం వస్తుందా? సత్తా చాటుదామా? ఇతర హీరోలకు, వారి అభిమానులకు సవాల్ విసురుదామా? అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రంగా దశాబ్దంపైగా గ్యాప్ తీసుకుని, తమ హీరో రీఎంట్రీ ఇవ్వడం, అంతకు ముందు తమ అభిమాన హీరో రాజకీయాలలో సరిగా సక్సెస్ కాకపోవడంతో మెగాభిమానులు దానిని ఓ చాలెంజ్‌గా తీసుకుని, ఓ రీమేక్ చిత్రానికి అందునా పక్కా మాస్ అండ్ యాక్షన్ చిత్రం అయిన ‘ఖైదీనెంబర్ 150’ కూడా భారీగా వసూళ్లు తెచ్చిపెట్టారు.
ఇక రెండు వరుస డిజాస్టర్స్ తర్వాత మహేష్ అభిమానులు ‘భరత్ అనే నేను’కి, ఓవర్‌సీస్‌లో పెద్దగా సంచలనాలు నమోదు చేయని రామ్‌చరణ్ ‘రంగస్థలం’పై కూడా అభిమానపు జల్లు కురిపించారు. ఇక బాలయ్య అంటే పక్కా మాస్ అండ్ యాక్షన్ హీరో. కానీ అదే బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రంగా హిస్టారికల్, బయోపిక్ ‘గౌతమీపుత్రశాతకర్ణి’ వస్తే తెగ హడావుడి చేశారు.
కానీ నందమూరి అభిమానులే కాదు.. ఏకంగా ఓ సామాజిక వర్గం దేవుడిలా కొలిచే స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా ఆయన ముద్దుల వారసుడు బాలకృష్ణ చేస్తున్న ‘కథానాయకుడు, మహానాయకుడు’పై ఓవర్‌సీస్ అభిమానులు భారీ ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు. దీనిని ఎలాగైనా బాలయ్య కెరీర్‌లో అందునా ఓవర్‌సీస్‌లో మరుపురానిదిగా చేయడం కోసం అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్‌పై ఒత్తిడి తేవడంతోపాటు భారీ టిక్కెట్ల రేట్లను నిర్ణయించారు.
మరికొందరు వీరాభిమానులు మరో అడుగు ముందుకేసి ‘కథానాయకుడు’ చిత్రం విడుదల కానున్న థియేటర్లలో టిక్కెట్లను వేలం పాట ద్వారా దక్కించుకునే ఏర్పాటు చేసి, బాలయ్యకి , ఎన్టీఆర్‌కి అరుదైన కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు ‘కథానాయకుడు’ సంక్రాంతి రేసులో ముందుగా విడుదలయ్యే భారీ చిత్రం. దీనికి సంబంధించిన సెన్సార్ అయిందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావడం లేదు.
రెండు భాగాలు పూర్తి అయితేనే గానీ సెన్సార్ ఇవ్వమని అన్నారని కొందరు, కొందరు ఆఫీసర్లు సెలవులో ఉన్న కారణమని మరికొందరు, ప్రతిదీ మంచి సమయం, శుభముహూర్తాలు చూసే బాలయ్యే మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాడని.. ఇలా పలు వాదనలు ఉన్నాయి. మరికొందరు మాత్రం సెన్సార్ సైలెంట్‌గా అయిందని, క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి వీటిల్లో నిజం ఏమిటో తెలియాల్సి ఉంది.