ఏమాటకామాటే చెప్పుకోవాలంటే తెలుగు చిత్రాలు ప్రస్తుతం జాతీయ భాషలోనే గాక ప్రాంతీయ భాషల్లో కూడా సత్తా చాటుతున్నాయి. ‘బాహుబలి’తో ఈ క్రేజ్ బాగా పెరిగింది. మరోపక్క పక్కా మాస్, యాక్షన్ తెలుగు చిత్రాల హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ చానెల్స్‌కి, డిజిటల్ మీడియాకి బంగారు కోడి పెట్టలా మారుతున్నాయి. ఇలాంటి చిత్రాల హక్కుల కోసం హిందీలోని పలువురు హైదరాబాద్‌లోనే మకాం వేస్తున్నారు. తెలుగులో పెద్దగా సత్తా చూపని ‘డిజె’, చివరకు నితిన్ ఫ్లాప్ చిత్రం ‘లై’ సైతం అక్కడ వీరవిహారం చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ప్రతి హీరో, ప్రతి చిత్రంలో ప్రత్యేకంగా ఈ ఆకర్షణ కోసం మూడు నాలుగు వీరలెవల్ ఫైట్స్‌ని కూడా ప్రత్యేకంగా తీసి కలుపుతున్నారు. ఈ విషయంలో ‘వినయ విధేయ రామ’ ముందంజలో ఉంది.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే ఇలాంటి మసాలాలు ఇందులో ఉండే అవకాశం పెద్దగా లేదు. ఏదైనా సరే కథానుగుణంగానే సాగాల్సిన బయోపిక్ ఇది. కాస్తైనా మాస్ ప్రేక్షకులను ‘కథానాయకుడు’ అయినా అలరిస్తుందేమో గానీ ‘మహానాయకుడు’ మాత్రం సీరియస్‌గా సాగే సబ్జెక్ట్. అయినా ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకుడు కావడం, జాతీయంగా కూడా ఆయన జీవితం ఏమిటి? అని చూసే వారి ఆసక్తి కారణంగా కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.
ఇక విషయానికి వస్తే ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం తర్జనభర్జనల మధ్య గట్టి పోటీలో జనవరి 10నే విడుదల కానుంది. ‘నవాబ్, సర్కార్’ చిత్రాలతో అనువాద చిత్రాల నిర్మాతగా మారుతోన్న వల్లభనేని అశోక్ ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ చిత్రం కూడా పక్కా మాస్ మెటీరియల్‌తోనే వస్తోంది. అయినా తెలుగు ప్రేక్షకులను ‘వినయ విధేయ రామ’తో మాస్, యాక్షన్‌గా దింపుతోన్న సమయంలో ఈ ఊరమాస్‌ని రజనీ ‘పేట’ తట్టుకోగలుగుతుందా? అనేది వేచిచూడాలి. అయితే ఇక్కడ ఈ చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్‌కి కాస్త జాక్‌పాట్ తగిలింది. మొదట్లో 25కోట్లకు తగ్గేది లేదని భీష్మించుకున్న సన్ పిక్చర్స్ సంస్థ తెలుగులో ఉన్న గట్టి పోటీ దృష్ట్యా, భారీగా ధియేటర్లు లభించే అవకాశం లేకపోవడంతో కేవలం 10 నుంచి 12కోట్లకే డీల్‌ని సెట్ చేసిందని తెలుస్తోంది.
ఈ ఊరమాస్, అందునా రజనీ స్టైల్‌ని అభిమానించే వారు విపరీతంగా ఉన్న నేపధ్యంలో తెలుగులో ఈ మూవీ సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలవడం గ్యారంటీ అనే చెప్పాలి. రజనీ ‘పేట’ని అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్న అశోక్‌కి ఇది బంగారు కోడి ‘పేట్ట’గా మారడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఫ్యామీలీ, కామెడీని నమ్ముకుని సంక్రాంతికి అనూహ్య విజయాలు సాధిస్తోన్న దిల్‌రాజు ‘ఎఫ్ 2’ కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. అలా ఈ సంక్రాంతి అన్ని చిత్రాల నిర్మాతలకు బాగా కలిసొస్తుందనే చెప్పాలి.