ఒక సినిమాని దర్శకత్వ శాఖలో మంచి అభిమానం ఉన్న వ్యక్తి తీయడానికి, సదరు చిత్ర కథానాయకుడి మీద అభిమానం ఉన్న వ్యక్తి తీయడానికి చాలా తేడా ఉంటుంది. దర్శకుడు కంటెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు.. అదే అభిమాని తన హీరోని ఎంత అద్భుతంగా, కొత్తగా చూపించాలని ఆలోచిస్తాడు. అందుకు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆస్థాయి ఎలివేషన్ ఏ దర్శకుడూ ఇవ్వలేకపోయాడు. అందుకే గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కే కాదు ఆయన అభిమానులకు కూడా ఓ అపూరూపమైన సినిమాగా మిగిలిపోయింది.
ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసిన చిత్రం పెట్ట. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది, నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. కార్తీక్ సుబ్బరాజ్ భారీ ఎలివేషన్స్ ప్లాన్ చేశాడని అర్ధమవుతూనే ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ కూడా రజనీకాంత్ కి విశేషమైన వీరాభిమాని. అందుకే తన కలల కథానాయకుడ్ని తాను ఎలా చూడాలనుకొన్నాడో అలాగే ప్రెజంట్ చేశాడు.
అసలే కబాలి, కాలా లాంటి డిజాస్టర్స్ తో ఇబ్బందిపడుతున్న రజనీ స్టార్ డమ్ కి 2.0 కాస్త ఊపిరిపోసినా.. రజనీ ఈ బ్యాక్ అనిపించే సినిమా మాత్రం పెట్ట అని రజనీ ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. తెలుగుతోపాటు తమిళంలోనూ భారీ పోటీ నడుమ విడుదలకానున్న ఈ చిత్రం రజనీ పాత రికార్డ్స్ మాత్రమే కాక ఇప్పటివరకు నమోదైన రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేయడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు. మరి ఈ ఫ్యాన్ ఫిలిమ్ ఫ్యాన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో తెలియాలంటే జనవరి 10 వరకూ వెయిట్ చేయాల్సిందే.